Jump to content

పుట:Chinnanati Muchhatlu K N Kesari 1999 206 P.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిన్ననాటి ముచ్చట్లు 87

తమ బిడ్డలను వలె కంచెములో అన్నము నోటికి కబళమందిచ్చి పెంచుకొనే ఎడ్లను గాసిపెట్టితే గుంటూరి రైతులు, అందును పల్నాటివారు సహించరు. 1921-22లలో సహాయ నిరాకరణపు గొడవలప్పుడు పోలీసులు జప్తుకు వచ్చిరి. కన్నెగంటి హనుమంతు అనువాని ఎద్దులను జప్తు చేయదలచిరి. అతడు కాదనెను. ఆ గందరగోళములో అతడు పొలీసుల తుపాకికి గురియై చచ్చెనేగాని బ్రతికియుండగా తన ఎద్దును పట్టనివ్వలేదు.

మా ఊరిలో ముఖ్యముగ ముందు ముత్తయిదువులు పూర్వ సువాసినీలు ఉలవ గుగ్గిళ్లు, జొన్న పేలాలు, పేలపిండి, భుజించి శివరాత్రినాడు జాగరణ సలుపుచుండిరి. ఈ జొన్న పేలాలకు ఎర్రటి కొరివికారమును పట్టించి భుజించెదురు. పేలపిండిలో పెరుగు కలిపి త్రాగెదరు. ఉలవగుగ్గిళ్లలో పచ్చిమిరపకాయలను కొరుకుతూ తినుచుండిరి. కొందరు సొజ్జ రొట్టెలను, తప్పెలబిళ్లలను, కాల్చి ఫలహారమును చేయుచుండిరి. ఈ కటికి ఉపవాసములతో రాత్రిళ్ళు జంగము కథలు, లక్ష్మణ మూర్చ, శీతమ్మ కడగండ్లు, విని జాగరణ చేయుచుండిరి. మరికొందరు అచ్చనగండ్లు గవ్వలాటలతోను, మరికొందరు చీలిజగడాల తోను రాత్రి అంతయు ప్రొద్దు పుచ్పుదురు. తెల్లవారగనే యేటిలో స్నానము చేసి వంటకములను తయారుచేసుకొని బ్రాహ్మణునికి ఔపోసనవేసి పారణ ముగించెదరు.

రంగిరీజులనగా గుడ్డలకు రంగువేయువారు. వీరు రంగులతో గండభేరుండ, కోటు కొమ్మంచులను చీరలకు ధోవతులకు అంచుగట్టి అద్దుచుండిరి. ఒక చుక్క, మూడు చుక్కలు, అయిదు చుక్కలతో చుక్కల చీరెల నడుచుండిరి. ముదురు చెంగావి, పాల చెంగావి, చుట్టు చెంగావి చీరెలను ధోవతులను, గువ్వకన్ను, నెమలికన్ను చీరెల నద్దుచుండిరి.