Jump to content

పుట:Chinnanati Muchhatlu K N Kesari 1999 206 P.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

86 చిన్ననాటి ముచ్చట్లు

పామరులు, బిచ్చగాండ్రు, నేటికిని 'రాజా చెన్నాపారెడ్డి. నీ పేరే బంగారపాకడ్డి' అని పాటలు పాడుచుందురు. ఇతని సాహసములగూర్చి ఎన్నియో కథలు చెప్పుదురు. ఇతడేదో మ్రొక్కుబడి యుండి ప్రభ కట్టుకొని కోటప్పకొండకు నడిచినాడట. ప్రభవెంట ఇతని సోదరియు వచ్చినదట. చెన్నప్పరెడ్డి ప్రభ బండికి పూన్చిన ఎద్దులు పొగరు గ్రక్కుతూ నడుస్తున్నవి. నొగలకూర్చుని తోలువాడు, ప్రక్కతాళ్లబట్టి అదలించి నిగ్రహించువారు జాగ్రత్తగా నడిపిస్తున్నారు. కొండపైకి కొంత దూరమున కేగిన మీదట ఆ ఎద్దులలో నొకటి జనసమూహమును జూచి కొంతమొరకు చేయుచున్నది. పోలీసు భటులు అథార్టీ చేయవచ్చిరి. మీరు కలుగజేసుకోవద్దు; మేము సమాళిస్తాము' అని ఆ ఎడ్లమచ్చిక తెలిసిన రైతులనుచున్నను ఆ పోలీసులలో నొకడు వినిపించుకొనక తన లాటీకర్రతో ఆ ఎద్దును పొడిచెను. అది రెచ్చిపోయినది. కలియ ద్రొక్కుచున్నది. అయినను ఆ రైతులు దానిని కొంత శ్రమపడి సమాళించగల్గువారే. కాని పోలీసు శాఖ వారికా ఓర్పునేర్పు లేకపోయినది. రైతులందరు - "వద్దు, వద్దు" అని అదలిస్తున్నా వినిపించుకోక వారు ఆ ఎద్దుపై తుపాకీని ప్రేల్చిరి. రైతుల కుద్రేకము కల్గినది. 'చూస్తారేమిరా, మీసాలుగల మొగవాళ్ళు' అని గర్జించి చెన్నప్పరెడ్డిసోదరి కోక విరిచికట్టి గండ్రగొడ్డలి తీసికొని ముందు కురికినది. ఎర్రటోపీగల (నాడు పోలీసులకు తెల్లదిరుసు, ఎర్రటోపీలు) తలలెల్ల ఎగిరి పోయినవి. భూమిపై ఇంకా గింజలుగల పోలీసులంతా తమ యూనిఫారములు టోపీలు తీసి పారేశారు. అధికార్లు చాలామంది అధికార చిహ్నములను జారవిడిచారు. నామాలు పెట్టుకొని దాసరులు, బూడిద పూసుకొని జంగాలు అయి నాటికి ప్రజా సామాన్యంలో కలిసి ప్రాణం దక్కించుకున్నారు. నిజంగా ఆనాడు కోటప్పకొండమీద చెన్నప్పరెడ్డి ప్రభముందు రక్తపువారులే పారినవి.