82 చిన్ననాటి ముచ్చట్లు
రుబ్ళినపిండి పెట్టి పెంచెదరు. ఈ తిండిని తిని ఆ వృషభ రాజములు తెల్లగ తయారగును. వాటి చర్మము తెల్లటి వెలువెట్టుపట్టును బోలి మిసమిస మెరయుచుండును. మెడలకు గట్టిన గజ్జెల పట్టెళ్లు, మొగమునకు తగిల్చిన కుచ్చుల శిగమోరలు, కాటుక కండ్లు, కురచకొమ్ములు, మెడమీద పెద్ద చెండువంటి గట్టి మూపురములు, మెడ మీదుగా రొమ్ముచుట్టిరా బిగింపబడిన తోలు పటకాలు ఇన్నింటితో గాంభీర్యముట్టిపడ నడచివచ్చు ఆ ఎద్దులను చూచినప్పుడు, పెండ్లికొడుకలు పెండ్లికి తరలిపోవుచున్నట్లు గాన్పించును. అవి నడచుచు, అప్పుడప్పుడు తలవిసరు, వయ్యారమును, గాంభీర్యమును, అలంకారమును కనులపండువుగ నుండును. అట్లె ఉత్సాహము కొలది అవి వేయు రంకెలును ఉత్తేజముగను ఉద్రేకకరముగను నుండుటయేగాక శంఖారవమువలె శ్రావ్యముగను ఉండును. సంగీతశాస్త్రమునందు ఈ రంకెనే సప్తస్వరములలో రెండవదియగు 'రి' (ఋషభం) అని నిర్ణయించిరి. ఈ స్వరముచే వీరరసము, అద్భుతరసము, రౌద్రరసము వెల్లడియగునని చెప్పబడినది. శార్జధరుని సుభాషితములలో ఇట్లు నిర్వచింపబడినది. "పడ్డర్షభౌ తధాజ్ఞౌయౌ వీర రౌద్రాద్భుతే రసే || కావుననే ఈ బండ్లకు బాగుగా బలిసిన కోడెలనుగాని కోడెప్రాయపు ఎడ్లనుగాని కట్టెదరు. ఈ బండ్లమీద కూర్చుని తోలేరైతులను మంచి వయసు కుర్రవాండ్లుగనుందురు. మంచి దృఢకాయము కలిగి కందుకూరి తలగుడ్డలను, చెమ్లా పాగాలుగా తలలకుచుట్టి, రంగు రుమాళ్లను నడుములకు బిగించికట్టి ముల్లుకర్రలతో ముందు నొగలలో కూర్చుందురు. మొలకు బిళ్లలత్రాడు, కాళ్లకు ఎఱ్ఱబణాతు గురిగింజలు అమర్చిన కిర్రుచెప్పలు, చేతులకు వెండి మురుగులు, సందిట దండ కడియములు, చెవుకు జంపు, ఇత్యాదులతో సింగారించుకొని, కోరమీసములతో, కొంటెచూపులతో, కండ్లమీదుగా కణతలు కలియదిద్దితీర్చిన విభూతిరేఖలతో, కనుబొమలమధ్య నుంచిన కుంకుమ బొట్టుతో,