1
బాల్యము - విద్యాభ్యాసము
మా తల్లికి నేనొక్కడనే సంతానము. ఆమె తనకు ఆడబిడ్డలులేని ముచ్చట తీర్చుకొనుటకై నాకు ఆడపిల్ల వేషమువేసి ఇరుగుపొరుగిండ్లచూపి ఆనందించుట నాకిప్పటికిని జ్ఞాపకమున్నది. నా 5వ ఏటనే మా అమ్మ నన్ను మా ఊరిలో బడికి చదువ పంపినది. ఆ బడిపంతులు పేరు పిచ్చయ్యగారు. వారికి పిల్లకాయలకు చదువు చెప్పగల సామర్థ్యము లేకపోయినను చీటికి మాటికి వారిని చావగొట్టేవారు. అందుచేత వారిని చూస్తే పిల్లకాయలందరికి చాలా భయముగా ఉండేది. ఆకాలములో బడిపంతుళ్లకు నెలజీతములు లేక నెలకింతని జీతముగానిచ్చుట లేకపోయినను భోజనపదార్థములగు వరిగలను, కాయధాన్యములను, వంకాయలు, గోంగూర పచ్చిమిరప కాయలు మొదలగు కాయగూరలను, రైతుల పిల్లకాయలు తెచ్చి ఇచ్చేవారు. అందుచే వారు పంతులు దయకు పాత్రులై యుండేవారు. అట్టివారికి దెబ్బలుండవు. ఏమీ తేలేని వారికి మాత్రము, పంతులు బెత్తముతో కావలసినన్ని పేముపండ్లను ప్రసాదించేవారు. బడిలో పిల్లకాయల సంఖ్యను బట్టి ప్రభుత్వమువారు అప్పటికి కొంతకాలమునుండి, సాలీనా రొఖ రూపమున గ్రాంటు నిచ్చుచుండిరి. ఆ సర్కారు గ్రాంటుకై ఆయన తంటాలుపడి పిల్లకాయలను బడికి చేరదీసేవారు.
కొత్త పిల్లకాయలను బడిలోనికి చేర్చేనాడు, బడిలో చదివే పిల్లలందరికి పప్పుబెల్లాలు పంచి పెట్టేవారు. పంతులుకు వరహా (4 రూIIలు)