78 చిన్ననాటి ముచ్చట్లు
ననుబాయ అగుచుండును. ఇంటినుండి వచ్చునప్పుడు ప్రయాణీకులందరు కమ్మపొడి, మినుముల చింతపండు పచ్చడి, చింతకాయ పచ్చడి వగైరాలనుకూడ తెచ్చుకొనెదరు. కుట్టుడాకులు కూడ యుండును. పచ్చళ్లు విసుగు పుట్టినప్పుడు పచ్చిపులుసును చేసుకొనెదము. ఆకాలమున నెయ్యి చౌక గనుక సమృద్దిగ నెయ్యిని తెచ్చుకొనుచుంటిమి. సమీపమున పల్లెలుండిన మజ్జిగ దొరుకును. అందరము భోజనముచేసి మిగిలిన అన్నమును రాత్రికి మూటగట్టుకొని, తప్పెలను తొమి, దానినిండుగ మంచినీటిని తీసుకొని పడవ చేరుదుము. పడవలో కూర్చుని కూరుకునుకు పట్టించెదము. పడవ సాగును. చల్లబడిన పిమ్మట అందరము పడవ పై భాగమున చేరుదుము. పైన గాలి చక్కగ వీచునప్పుడు ఆనందముతో పాటలు పద్యములను పాడుచుందురు. మాతో కూడ ఒక లాంతర యుండును. రాత్రికాగానే అన్నము మూటను విప్పి ఒక భాగ్యశాలి అన్ని పచ్చళ్లను యొకటిగ కలిపి కదంబము చేసి పెద్ద అన్నపువాయను కలిపి చుట్టు కూర్చున్న వారిచేతులలో ముద్దలుపెట్టును. పిడచ లగుటవలన పలుమారు నీరు త్రాగవలసి వచ్చును. వెన్నెలరాత్రి అయిన మరల పడవ పైకిపోయి నిద్రవచ్చువరకు కబుర్లు కథలు చెప్పుకొనుచుండి పిమ్మట దిగి నిద్రించెదము. ఈ ప్రకారము పడవ ప్రయాణము ఆ దినములలో చేయుచుంటిమి. ఈ పడవ ప్రయాణములలో కలిగిన ఆనందమును, ఆకలిని, భోజనము రుచిని యిప్పుడు తలుచుకున్న నేను అప్పటివాడనేనా యని సందేహము కలుగుచున్నది.
కొత్తపట్నం రేవులో పడవదిగి వంగోలుకుపోయి అక్కడ మా పెత్తండ్రి యింట్లో బసచేసి మరునాడు మావూరికి వెళ్లునప్పుడు ఒంగోలు నుండి వేడివేడి శనగపప్పును, ముంత ఖర్జూరపుపండును తీసుకొనిపోవు చుందును. నా అత్తగారికి మద్రాసు మిఠాయి దినుసులు సరిపడవు.