ఈ పుట ఆమోదించబడ్డది
76 చిన్ననాటి ముచ్చట్లు
వారితో కూడ ఉంటిని. వారు ఈ వూరికి క్రొత్తఅగుటవలన దహన సంచయనాది కార్యములకు నేను సహాయపడి ముగింపించితిని.
వారి భార్య అప్పుడు వైద్యశాలను విడిచిపెట్టవలసివచ్చినది. ఆమె ఉండుటకు మద్రాసులో స్థలము దొరకదాయెను. ఆమె దగ్గర బంధువులుకూడ ఆమెను వారిండ్లకు తీసుకొనిపోరైరి. అప్పడామెను మా యింటికి తీసికొనిపోయి ఆదరించితిని. వారి బంధువులు ఇతరులుకూడ ఆమెను మాయింటికి తీసుకపోకూడదని నాకు బోధించిరి గాని నేను వినలేదు. మన సంఘములోనున్న ఇటువంటి దురాచారములను అడుగంటునట్టు చేయుటయే సంఘసేవ.
'ఆమెను మీ యింటికి తీసుకొనిపోయిన మీ యింటిలో కీడు సంభవించునని' బోధించినవారు ఇప్పడు లేరు. ఆ తల్లి సుఖముగ బిడ్డలతో కూడ బరంపురంలోయున్నది. ఈమె కాకినాడ కాపురస్తులగు పోతాప్రగడ బ్రహ్మానందరావుగారి పెద్ద కుమార్తె.