74 చిన్ననాటి ముచ్చట్లు
పోయి వివాహాది శుభకార్యములు చేసుకొనుచుండిరి. ఇప్పడు మద్రాసులో పనులు గలవారు ఇండ్లను నిర్మించుకొని ఆరోగ్యమునకై అక్కడ నివసించుచున్నారు.
మద్రాసులోనుండు జనులు చాలవరకు బాడుగ యిండ్లలోనే నివసించువారగుటవలన, యెవరైనను ఆయింటిలో చనిపోయిన కర్మాంతరములను జరిపించుటకు యితర కాపురస్తులు ఒప్పకొనేవారుకారు. ఈ కారణమువలన మద్రాసులోనివారు చాల యిబ్బంది పడుచుండిరి. ఈ కార్యములను చేయుటకు ధర్మసత్రములను యిచ్చెడివారు కారు. ఇట్టి కష్టములను ముఖ్యముగ బ్రాహ్మణులే అనుభవించుచుండిరి.
ఈ కష్టములను చూచి యొక బ్రాహ్మణోత్తముడు రాయపురములో ఒక చిన్న తోటను అందు ఒక యిల్లును ఇచ్చి, ఈ కార్యములను అక్కడ చేయుటకు తగు యేర్పాటులను చేసి పుణ్యమును కట్టుకొనెను. ఈ బ్రహ్మతీర్ధమునందు బ్రాహ్మణులు మాత్రమే అపరక్రియలను జరుపుకొన వచ్చును. ఈ చిన్నప్రదేశము ఇప్పడు బ్రహ్మాండమైన బ్రహ్మసత్రముగ మారినది. గనుక ప్రతిదినము ఈ బ్రహ్మసత్రమునందు పది పన్నెండుకర్మలు జరుగుచున్నవి. వీరందరికి ఇక్కడ తగువసతులు యేర్పాట్లు గలవు. అందరికి కావలసిన పాత్రసామానులు కూడ యిక్కడ యిచ్చెదరు. కొందరు ధనికుల కర్మలను ఇక్కడ జరిపించిన పిమ్మట చనిపోయిన వారి పేరట ఒక చిన్నయింటిని ఈతోటలో కట్టించి యిచ్చెదురు. ఈ ప్రకారము ఈతోటలో వసతులు పెరిగిపోవుచున్నవి.
పల్లెటూళ్లలో చనిపోయినవారి కర్మ చేయించుటకు, బ్రాహ్మణార్ధములకు ముత్తయిదువులు మొదలగు వార్లకు చాల కష్టపడవలయును. ఈ బ్రహ్మతీర్ధమునందు ఆలాటి కష్టములు పడవలసిన పనిలేదు. పురోహితులు,