పుట:Chinnanati Muchhatlu K N Kesari 1999 206 P.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తొలి పలుకు

పేదరికమునపుట్టి, అసహాయులై, స్వయంకృషిచే విశేషధనము నార్జించి అనేక సంఖ్యాకులకు పలువిధముల సహాయ్యముచేసి, విద్యాసంస్థలకు లక్షల కొలది విరాళము లొసంగి, స్నేహపాత్రులై, ఆంధ్రదేశమునకు మాసిపోని వన్నె తెచ్చిన ధన్యజీవులు శ్రీయుతులు కేసరిగారు.

శ్రీ కేసరిగారు వైద్యశాస్త్రములో మిక్కిలి ప్రతిభను గడించి వ్యాపారము పెద్దచేయుటతోనే తృప్తి చెందలేదు. రాజకీయ విషయములలో పాల్గొనకపోయినను వారికి సంఘసంస్కరణములో అత్యంతమైన ఉత్సాహము. సాంఘికోద్యమములకు వారు చేసిన సహాయ్యములు ఈ పుస్తకము చదివినవారికి తేటతెల్లము కాగలవు.

హాస్యముగ విషయములను వర్ణింపగల శక్తి వారికి గలదు. అందుకు తార్కాణముగా అరవ కాపురము - తెలుగు కాపురమును పేర్కొనవలెను.

రసము వెలితికాకుండ ఆత్మ అనుభవములను సాదృశ్యము చేయగల నేర్పు గొప్ప రచయితులకు మాత్రము సాధ్యము. శ్రీ కేసరిగారి శైలి, వర్ణించు ధోరణి మిక్కిలి రుచికరములు. ఇది శ్రీ కేసరిగారు ఆంధ్రవాణికి యిచ్చిన కానుక. చిరకాలము ఈ పుస్తకము ఆంధ్ర సారస్వతము నలంకరించగలదని నా నమ్మకము.

7-3-53

మైదవోలు శేషాచలపతి

అడ్వకేటు, మద్రాసు.