చిన్ననాటి ముచ్చట్లు 71
తిరువత్తియూరు హైరోడ్డులో యున్నది. వీరి వైద్యశాల మొదట బ్రాడ్వేలో యుండెను. తరువాత మౌంటురోడ్డులో.
ఆ కాలమున హాలరు డాక్టరు కూడ ముఖ్యముగ కోమట్లలో చాల పరిచయము పలుకుబడి గలిగియుండెడివారు. వారు ఆంగ్లోయిండినులు. చాల పొట్టిగ సన్నగ యుండిరి. మంచి డాక్టరని పేరు. ఇంటికి వచ్చిన చిట్టికథలను చెప్పి రోగిని నవ్వించును. అతనికి యొక పాతబ్రూహాం బండి, ముసలి గుఱ్ఱము ఉండెడివి. ఆ బండి మనిషి నడక కంటె అధిక వేగముగ పోజాలదు. ఆ బండిలో కూర్చుని వారు యెప్పుడును యేదో వ్రాసుకొను చుండువారు. మద్రాసులో సోడా తయారుచేసి విక్రయించిన వారిలో వీరే మొదటివారు. హాలరు సోడాయనిన యిప్పటి స్పెన్సరు సోడా వలె పేరు పొందినది.
చెన్నపట్టణము అన్నిజాతులకు కూడలి స్థలమైనను బ్రాహ్మణులకు ప్రత్యేకముగ అగ్రహారములున్నవి. కొల్లావారి అగ్రహారం, క్రిష్ణప్పనాయుని అగ్రహారం, ఏకామ్రేశ్వర అగ్రహారం, రావిచెట్టు అగ్రహారం మొదలగునవి యును, మరికొన్నియును గలవు. ఇప్పడా అగ్రహారములలో బ్రాహ్మణులు తక్కువ; బ్రాహ్మణేతరులు అధికముగా నివసించుచున్నారు.
ఏకామ్రేశ్వర అగ్రహారములో ప్రసిద్ద పురుషుడగు రంగనాథ టాకరుగారు గొప్ప నగల వ్యాపారమును చేయుచుండిరి. వీరు గుజరాతి బ్రాహ్మణులు. మొదట తన యింటిలోనే యీ వ్యాపారమును ప్రారంభించి కొడుకలు పెద్దవారై ప్రయోజకులు కాగానే మౌంటురోడ్డులో గొప్ప భవనమును నిర్మించిరి. అక్కడ బంగారు, వెండి సామానులను నవరత్నములలో పొదుగబడిన వివిధ ఆభరణాదులను తయారుచేసి వ్యాపారమును చేయుచుండిరి. వీరికి ముఖ్య ఖాతాదారులు రాజులు,