Jump to content

పుట:Chinnanati Muchhatlu K N Kesari 1999 206 P.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

64 చిన్ననాటి ముచ్చట్లు

వీరు ముత్యాల వర్తకమున, పగడాల వర్తకమున చాలా పేరుపొందినవారు. ఈ ఓడ వర్తకమున ముఖ్యముగా క్రొత్తపట్నం, ఓడరేవు, బందరు, శ్రీకాకుళం, కాకినాడ మొదలగు రేవులనుండి మద్రాసుకు సరుకు దిగుమతి అగుచుండెను; మద్రాసునుండి కూడ సరుకు ఆయా రేవులకు ఎగుమతి జరుగుచుండెను. ఆ కాలమున మద్రాసు సముద్రతీరమునకు సమీపమున నొక వీధిలో ఓడ స్తంభములు (ఓడకాళ్లు) వగైరా ఓడసామానులు తెచ్చి ఉంచుచుండిరి. అప్పడా వీధికి ఓడకాలు వీధి అని పేరు వచ్చినది. ఈ ఓడ వ్యాపారము క్రమముగా నిలిచిపోయినది.

మద్రాసులో కొళాయినీరు లేనప్పుడు నగరమునకు నీటి సప్లయికి మూలమైన ఏడుబావులున్న వీధియగుట చేత నీవీధికి ఏడుబావులవీధియన్న పేరు వచ్చినది.

ఐన్ హౌస్ రోడ్డు వీధి మొదట వితంతు శరణాలయం (Widows Home) అను గుండ్రటి కట్టడము ఐస్ హౌస్ అను పేరుతో నున్నది. దీని ప్రక్కననే వెల్లింగ్టన్ బాలికా పాఠశాల గలదు. పూర్వము మద్రాసులో మంచుగడ్డ యుత్పత్తి చేయుట లేదు. అప్పడు దొరలు ఉపయోగార్థము విదేశములనుండి మంచుగడ్డలను ఓడలలో తెప్పించి ఈ కట్టడములో నిలువయుంచేవారు. అప్పుడందుచే ఈ కట్టడమునకు ఐస్ హౌస్ (Ice House) అనే పేరు గలిగినది. మంచుగడ్డను నిలువచేయుటకు ఈ కట్టడములో గచ్చుతో గుంటను కట్టియుండిరి. ఇచ్చటనే మంచుగడ్డ తయారుచేయుట కవకాశమేర్పడగానే దాని అవసరము తప్పిపోయినది. అంతనది అమ్మకమునకు రాగా మొట్టమొదట బిళిగిరి అయ్యంగారు అను అడ్వొకేటు కొనెను. ఆ తరువాత గవర్నమెంటువారు దానిని కొని బాగు చేయించి అందు వితంతు శరణాలయము నుంచిరి. ఎన్ని చేతులు మారినను ఆ బిల్డింగునకు ఆ పేరు మారలేదు; ఆ రోడ్డునకు నాపేరే ఏర్పడినది.