Jump to content

పుట:Chinnanati Muchhatlu K N Kesari 1999 206 P.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

9

వీధులు - కట్టడాలు

పూర్వము చైనాదేశమునుండి వచ్చుచుండిన తెల్లకాగితములను చైనాకాగితములనుచుండిరి. ఆ కాగితములను విక్రయించు అంగళ్లవీధికి చైనాబజారు అనే పేరు ఇప్పటికిని వాడుకలోనున్నది. ఇటీవల నేతాజీ సుభాషచంద్రబోసు పేరట పిలుచుచున్నారు. ఎ స్ప్లనేడు ఈ వీధిలో నొకభాగము.

బందరునుండి కొందరు అద్దకపు చీరలను తెప్పించి అమ్ముచుండిరి. ఈ వ్యాపారము చేయువారుకూడా బందరు, నెల్లూరు, కరేడ, ఇనమన మెళ్ళూరు మొదలైన ఊళ్లనుండి వచ్చిన రంగిరీజులు; తెలుగువారు. అందుచేతనే దీనిని బందరు వీధి అనిరి. ఆకాలమున పాలచంగావి ధోవతులు, చీరలు నాజూకు గనుక స్త్రీలు పురుషులు వాటిని ధరించు చుండిరి.

పూర్వము మద్రాసులో నాణెములను తయారుచేయుచుండిరి; గనుక ఆ పని జరుగుచుండిన వీధిని టంకశాల వీధి అని పిలువసాగిరి. 1692లో మొగలాయి పాదుషా ఆంగ్లేయులకు పాదుషాబొమ్మతో స్వయముగా నాణేములను అచ్చుపోసుకొనే హక్కునిచ్చెను. నాటినుండియు నిచ్చట చిరకాలము ఆ పని జరిగియుండెను. ప్రస్తుతము నిలిచిపోయినను ఆ వీధి కాపేరుమాత్రము పోలేదు. ఈ వీధి చాలా పొడవు.

పూర్వము మద్రాసులో దేశవాళీ, ఓడవర్తకము జరుగుచుండెను. ఈ ఓడ వర్తకమున పూర్వము సుప్రసిద్దులు సూరంవారు, అవధానంవారు, గుర్రంవారు మొదలైన నెలూరుజిల్లా బ్రహ్మణులు, తుమ్మగంట ద్రావిడులు.