62 చిన్ననాటి ముచ్చట్లు
నీరు నిల్వచేసి వడియగట్టి, ఊరికి సప్లయి చేయ నారంభించిరి. ఇది 13-5-1872న గవర్నరు నేపియర్చే ప్రారంభింపబడినది.
అనగా నాపుటుకలతో ప్రారంభమైన కొళాయినీరు నేను మద్రాసు వచ్చేటప్పటికి బాగా వ్యాప్తిలోనికి వచ్చినది. కాని కొళాయీలలో వచ్చే నీరు పరిశుభ్రముగా నుండేది కావు. చిన్నపురుగులు చేపలు వగైరా జీవములు వచ్చుచుండెను. ఆ కారణమున మద్రాసులోయున్న ధనికులు కొందరు పేరుపొందిన కొండూరు బావి నీరును (విల్లివాకం), టాకరు సత్రమున నుండు బావి నీరును తెప్పించుకొని త్రాగేవారు. ఈ రెండు స్థలములనుండు నీరు చాలా ఆరోగ్యకరమని ఆ కాలపు డాక్టర్లు చెప్పుచుండిరి. ఈ బావుల నీటిని బ్రాహ్మణులు పీపాయిలలో తీసుకొనివచ్చి కావలసిన వారికి బిందె 1కి అణావంతున ఇంటింటికి ఇచ్చి పోవుచుండిరి.
1940-41లలో మద్రాసులో నీటి సప్లయి వృద్ధిచేయుటకై ఎర్రరాళ్ల చెరువునకు తోడు పూండి చెరువును చేర్చిరి. కాని ఈలోపల జనము రెండు రెట్లకు మించి పోయినది. కావున ఎండాకాలమున మనిషి 1 కి ఒక్కకిరసనాయిలు డబ్పాడు నీళ్లు దొరుకుట దుర్లభమైనది.
నేను ఇచ్చటికి వచ్చినది మొదలు ఎన్నియో మార్పులు చెందినవి. కాని ఏ మాత్రము మార్పు చెందనివి మూడు : కొళాయిలలో అపరిశుభ్రమైన నీరు; కూవమునది దుర్గంధము; దేవాలయపు కోనేళ్లలో పేరుకొన్న పాచి.