Jump to content

పుట:Chinnanati Muchhatlu K N Kesari 1999 206 P.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిన్ననాటి ముచ్చట్లు 61

యూరపియనులు, హైందవులునుకూడా ఇష్టపడలేదు. యూరపియనులు బహుశా తమకు నీరు తగ్గునని తలచి యుందురు. హైందవులు, యంత్రములలో సప్లయి అయ్యే నీరు వాడుట అనాచారమని ఇష్టపడ కుండిరట. పురాతనముగా, దూరమైనా, తాము తెప్పించుకొనే మంచినీరే తెప్పించుకొని త్రాగుట, తమ దొడ్లలోనుండు బావులలోని నీరే వాడుకొనుట విడువకుండిరి.

నేను మద్రాసునకు వచ్చుటకు ముందు ఉన్న పరిస్థితులు దుర్భరముగా ఉండేవట. పట్నం విస్తారంగా పెరిగినది. పరిసరములగల 16 గ్రామములు కలిసి పట్నమైనది. 1871 జనాభా లెక్కలలో (అదియే వాస్తవమైన మొదటి జనాభాలెక్క) 4 లక్షల దాకా జనాభా కన్పించుచున్నది. జనాభా ఎక్కువగ పెరిగినప్పటికిని శతాబ్దము నాడున్న నీటి వసతేగాని చిరకాలము క్రొత్తవసతి యేమియు యేర్పడలేదు. పూండీ చెరువు స్కీమున్నూ పట్నమున గల జనాభా నీటికరువును తీర్చజాలకున్నది.

దూరాభారమునుండి నీరు తెచ్చుకోలేనివారు, స్వంతబావులు లేనివారు అయిన పేదసాదలేగాక, అగ్రజాతులవారుకూడా ఆచారమునకై దేవాలయములనంటిన చెరువులలోను కోనేళ్లలోను నీరు వాడుకొనేవారు.

నీటి యొద్దడి తీర్చుటకున్నూ, పరిశుభ్రమైన నీటిని సప్లయి చేయుటకున్నూ, ప్రభుత్వమువారు 1861 నుండి ఆలోచన లారంభించిరి. స్కీములు వేసిరి. ఏడుబావుల నీరున్నూ పరీక్ష చేయించి, అందులో కూడ అపరిశుభ్రతయున్నదని అనుమానించిరి. కడకు ఎర్రకొండల చెరువు, చోళవరం పంటచెరువులు కలిపిన స్కీము 1866లో అంగీకృతమై ఆరేండ్లలో ముగిసినది. ఆ చెరువునుండి శాస్త్ర పద్దతిని నీరు తెచ్చి కీలుపాకులో సముద్రమట్టమునకు 44 అడుగుల ఎత్తున ట్యాంకులు కట్టి,