Jump to content

పుట:Chinnanati Muchhatlu K N Kesari 1999 206 P.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిన్ననాటి ముచ్చట్లు 57

వారందరు యెందుకు పనికిరాక కడపట పీనుగలమోయు వృత్తిలో చేరినవారు. వీరు మద్రాసులో అక్కడక్కడ నిర్ణయ స్థలములలో నిలుచుకొని పిలుపులకు నిరీక్షించుచుందురు. కర్మకాండను జరిపించు పౌరోహితుడు పోయి ఒక జట్టును చచ్చినవారింటికి పిలుచుకొనివచ్చును. ఈ పౌరోహితునకు వీరందరు పరిచయస్తులే, వచ్చిన వాహకులు చచ్చినవారిని చూచి బేరము పెట్టెదరు. ధనవంతుడై లావుగనుండిన వాహకుల పంట పండినదే. ఒక జట్టు వచ్చినచోటికి మరియొక జట్టు రాకూడదను కట్టుబాటు వీరికి గలదు. ఈ వాహకులు అడిగినంత డబ్బు యివ్వలేక పోయినను వారిని పిలుచుకవచ్చిన పౌరోహితుడు తీర్మానించిన ప్రకారము వారు సమ్మతించి శవమును లేవదీసుకొనిపోయెదరు. ఈ పౌరోహితుని దయ వీరికి కావలసియుండును. వీరికిందులో కమీషన్ కూడ నున్నది.

ఈ దేశమునయున్న మిగత అన్ని పద్ధతులకంటె శవమును దహనము చేయుటయే మంచిపద్దతియని ఇప్పడు పాశ్చాత్యులు, నాజూకైన పద్దతి నొకదానిని కనిపెట్టిరి. ఒక పెట్టెలో శవమునుంచి తలుపును మూసి ఎలక్రిక్ స్విచ్చిని వేసిన నిమిషములో శవము భస్మమైపోవునట.

ఆ కాలమున చెన్నపట్నమున గుర్రములను కట్టు పెట్టెబండ్లు ఉండేవి. ఇవి కూర్చుండుటకు చాలా అసౌకర్యముగా ఉండేవి. ఆ పెట్టె జట్కాలు క్రమంగా మారి నేటి గూడజట్కాలు అయినవి. వీటిని వేలూరు జట్కాలు అని అప్పుడు అనేవారు. ఆకాలపు జట్కాలలో కూర్చుండిన ముందువారు వెనుకవారిమీద పడునట్లు ఏటవాలుగా నుండెడివి. ఈ పెట్టెబండ్లు, రెండెద్దులబండ్లున్నూ ఉండేవి.

నాటికి నేటికి మారనివి వంటెద్దు గూడుబండి, రేఖలాబండి. రేఖలా అనగా రెండు తేలికైన చిన్న చక్రములు కలిగియుండును.