పుట:Chinnanati Muchhatlu K N Kesari 1999 206 P.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిన్ననాటి ముచ్చట్లు 55

అన్నాదులను తినుచుందురు. వారి వాకిట ముందర గుంపుగచేరి డబ్బు యిచ్చు వరకు కేకలు వేయుచుందురు. రాత్రిళ్లు యిండ్ల పంచలలోను మూసివేసిన అంగళ్లముందరను పండుకొనెదరు. పట్టణం కోమట్లకు వీరిని చూచిన భయము. కోమట్లు వీర్లకు నెలజీతములిచ్చి తమ యిండ్ల ముందరను రాత్రిళ్లు పండుకొనునట్టు యేర్పాటు చేసుకొనెదరు. ఈ సోమర్లు పెండ్లి వూరేగింపులకు దివిటీలను పట్టెదరు. వెదురుబద్దల తోను, రంగు కాగితములతోను 20 అడుగుల పొడవు కల్గిన రాజు, రాణిబొమ్మలను భీకరాకారముగ తయారుచేసి లోపలదూరి వూరేగింపుల ముందర పోవుచుందురు. విరోధులుగ నుండువారిని కొట్టుటకు డబ్బిచ్చినచో వార్లను చావగొట్టి వచ్చెదరు. వీరలు కల్లుసారాయిని త్రాగకపోయినను గుంపులుగుంపులుగ చేరి గంజాయిని త్రాగుచుందురు. వీర్లలో స్త్రీలుకూడ గలరు. ఈ తెగ పురుషులందరు మొదటి ప్రపంచ యుద్ధములో ఖర్చు అయినారు. ఇప్పడువారు మద్రాసులో కనబడుట లేదు.

మద్రాసులో నాటినుండి నేటివరకు, పలువిధములగు బిచ్చగాండ్రు కన్పించుచున్నారు. వీరిలో న్యాయముగ పరుల దానధర్మములపై తప్పనిసరిగా బ్రతుకవలసిన దౌర్భాగ్యులేగాక, కృత్రిమ సంపాద్యపరులు పలువురున్నారు. ఆరోజులలోను మరకాళ్లను పట్టుకొని బిచ్చమెత్తే వారుండిరి. లక్కబొమ్మలను చేతికి తగిలించుకొని ఆడించుచు వినోదము కల్పించి బిచ్చమడిగే ఆడువారున్నూ తిరిగేవారు. కొజ్జాలనే నపుంసకులు, మద్దెల తాళములతో ఆటపాటల ప్రదర్శించుచు ఇండ్లకువచ్చి, బిచ్చెమెత్తు కునేవారు. కొజ్జాలనగ మగవారైయుండిన్నీ ఆడువారివలె వేషభాషలననుకరించే యొక విధమగు నపుంసకులు. వీరు నవాబుల అంతఃపురములలో ఘోషాస్త్రీలకు పరిచారకులుగా నుండెడివారు. వీరి ఆటపాటలు కొంత