చిన్ననాటి ముచ్చట్లు 51
లందును యూరపియన్ సిపాయీలు విచ్చుకత్తులతో పహరాలిచ్చేవారు. అప్పుడప్పుడు కోట మైదానమునందు సోల్జర్ల కవాతు జరుగుచుండెడిది. ఈ కవాతును చూచుటకు పురజనులు గుంపులు గుంపులుగా పరుగిడుచుండిరి. నేను వచ్చుటకు కొంచము ముందుగానే 1884 ప్రాంతమున ప్రస్తుతము 'మెరినా' అని పిలువబడు అందమైన 'బీచి' కట్టబడినది. అయితే నాటిరోజులలో పురుషులేతప్ప స్త్రీలు బీచి షికారులకు నిర్భయముగా వెళ్లగలిగే వారు కారు. ఏలననగా అవివాహితులైన యూరపియనులు, చిన్నవయసువారు వంటరిగా నీదేశమునకు సోల్జర్లుగ వచ్చేవారు; వారిని చూచి మనదేశీయులు జంకేవారు. వారెప్పుడైన జట్లు జట్లుగా పట్నపువీధులలో తిరుగునప్పుడు నగరవాసులు పలువురు తమ ఇండ్లవాకిళ్లు మూసికొని లోపల కూర్చుండి, వారు వెళ్లిపోయిన తర్వాత తీసేవారు.
అప్పుడప్పుడే మద్రాసు హార్బరును కట్టుట ప్రారంభమైనది. నాడు సముద్రపు ప్రయాణీకులు స్టీమరు నెక్కుటకు నేడున్న సౌకర్యములు లేవు. పాత ఇనుపవారధి నుండి క్రిందనీళ్లలోనికి నిచ్చెన ఉండేది. దానిమీది నుంచి చిన్నలు పెద్దలు గడగడలాడుచు క్రిందనుండు చిన్నబోట్లలోనికి దిగేవారు. ఆ బోట్లు అలలతో కొట్టుకొనుచుండగా, కొంతదూరమున నున్న పెద్ద స్టీమరువద్దకు వెళ్లి దానిలోనికెక్కేవారు. శని ఆదివారములందు బడిపిల్లలము ఆ యినుపవారధి మీదికి షికారువెళ్లి ఈ తమాషా అంతయుచూచి ఆనందించేవారము. సముద్రుడు అనుగ్రహించి క్రమముగా వెనుకకు జరుగుచు పురజనులకు కాళీస్థలము నిచ్చుచున్నాడు. ఏమో, ఎప్పడు ఆగ్రహించి మరల ముందుకురుకునో, అప్పడేమేమి మార్పులు కలుగునో?
నేను ఈ పట్టణమునకు వచ్చినపుడు ఇక్కడి వీధులు గుంటమిట్టలుగా నుండెను. వర్షము కురిసినప్పుడు వీధుల నుండి