Jump to content

పుట:Chinnanati Muchhatlu K N Kesari 1999 206 P.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

48 చిన్ననాటి ముచ్చట్లు

కొందరు చదువుకున్నవారు భర్తపేరు కాగితముమీద వ్రాసి చూపించెదరు. అరవలలో యింత పట్టింపులేదని తెలియుచున్నది.

నా గృహలక్ష్మి శుద్ద అమాయకురాలు. పాతకాలపు పల్లెటూరి భాగ్యశాలి.

పెండ్లినాడు నేను యీమెకు ఒక బంగారు చామంతి రేకుల జడబిళ్లను పెడితిని. మేము నారాయణమొదలి వీధిలో కాపురమున్నపుడు ఆ జడబిళ్ల వెండిచుట్టు విరిగిపోయినది. అందువలన ఆ జడబిళ్ల పెట్టుకొనుటకు వీలుకాకుండెను. అప్పడామె ఆబిళ్ళను తానే బాగుచేసుకొని మరల ధరించుకొనవలయుననే ఉద్దేశముతో విరిగిన రెండు సగములను చింతపండుతో అతికించి యింటి వీధి అరుగు మీద యెండలో సూర్యపుటముపెట్టి వీధితలుపును మూసుకొని లోపలికిపోయెను. అరుగుమీద పెట్టిన బంగారపుబిళ్ల యెండకు తళతళమని మెరయుటను దోవనపోవు యొక పెద్దమనిషి చూచి తిన్నగ దానిని తస్కరించుకొని పరారి చిత్తగించెను. ఈమె అక్కడ దానిని పెట్టిన సంగతియే మరచిపోయినది. కొంతకాలమునకు ఆ సంగతి ఆమెకు జ్ఞాపకమునకు వచ్చి పెట్టిన స్థలమునకు పోయి వెతికినది. అక్కడ లేకుండెను. అప్పడు నాతో చెప్పినది.

సాధారణముగ కంసలిబత్తులు విరిగిన నగలను టంకముపొడితో (వెలిగారము) అతుకువెట్టి కుంపటి పుఠమును వేయుదురు. ఈ తల్లి చింతపండుతో అతికించి సూర్యపుఠము పెట్టినది. ఈమెకు తోచిన కిటుకు యింకను కంసాలివారు గ్రహించలేకున్నారు.

నా తండ్రి తిథి వచ్చినది. ఆనాడు అంగడినుంచి సత్తుతప్పెల నిండుగనెయ్యి తెచ్చితిని. నిమంత్రణ బ్రాహ్మణులు ఆకుల ముందర