చిన్ననాటి ముచ్చట్లు 47
చదువుకొనిన పరిచయముండినది. నా భార్య వారింటికి మంచినీళ్లకు పోయినప్పుడు ఆడవారు ఈమెకు పరిచయమైరి. ఒకనాడు ఈమె వారింటికి పోయినప్పుడు మీ పేరేమమ్మా' యని వారడిగిరి. అప్పుడు ఈమె తన పేరు రేపల్లె యని జవాబు చెప్పెను. ఈపేరు మద్రాసువారికి క్రొత్తగనుండుట వలన వారు ఫక్కున నవ్వి 'యిదేంపేరమ్మా' యని పరిహాసమును చేసిరి. అప్పుడు శెట్టెమ్మను మీ పేరేమని మా ఆబిడ అడిగెను. తన పేరు కనకమ్మయని శెట్టెమ్మ చెప్పుకొనెను. ఆనాటినుండి నా భార్యకూడ కనకమ్మ అనియే పేరుపెట్టుకొనినది. మద్రాసులో అందరు ఆమెను కనకమ్మ అనియే పిలుచుచుండిరి. అయితే పుట్టింటికి పోయినప్పుడు మాత్రము నామకరణమునాడు పెట్టిన రేపల్లె పేరుతోనే పిలుచుచుండిరి. నేనును ఈమెను కనకం అని తిన్నగా పిలుచుచుంటిని. కాని, భర్త భార్యను పేరుపెట్టి పిలుచుట దోషమని ఈమెకు యిష్టము లేకుండెను.
సాధారణముగా మద్రాసులో కోమట్లు భార్యను "యెవరాడా? అని పిలుచుచుందురు. ఒసే, ఓసి, ఏమె, ఎక్కడున్నావు, అబిడ, ఆఁ, ఊఁ, అను మొదలగు సంకేత నామములతో మరికొందరు పిలుచుచుందురు. కొందరు బుద్దిమంతులు ఏమమ్మోయియని అమ్మయని పిలుతురు. భార్యలు భర్తలను పిలుచునపుడు శెట్టిగారని, అయ్యరు అని, పంతులని, ఏమండి అని, నాయుడని, మొదలియారని గౌరవనామములతో పిలచెదరు. అయితే కొందరు స్త్రీలు భర్త పేరడిగినప్పుడు మాప్రక్కయింటి కృష్ణవేణమ్మ భర్తపేరే మా ఆయనపేరుకూడ యని చెప్పెదరు. పేర్లు చెప్పకూడదనే ఆచారము యెందుకు వచ్చినదో తెలియదు. పెండ్లినాడు పేర్లు చెప్పుకొను ఆచారముయొక్క అర్థమును మన వారికి తెలియకున్నది. ఆనాటినుండి మనము ఒకరినొకరు పేర్లతో పిలుచుకొనవలయుననే అర్థము. కొందరు భార్యను పేరుతో పిలుచుచున్నారుగాని భర్తను పేరుతో పిలుచుట లేదు.