46 చిన్ననాటి ముచ్చట్లు
అయితే ఈమె అప్పుడప్పుడు వంట చేయునపుడు, పచ్చళ్లను నూరునప్పుడు తల్లివద్ద నేర్చుకొనివచ్చిన లక్మణమూర్ఛ, శీతమ్మ కడగండ్లు, కుశలవ కుచ్చలకథ, పాముపాట మొదలగు పాతపాటలను పాడుకొనుచుండును. మడికట్టుకొని లక్షవత్తుల నోమునకు కావలసిన జడపత్తి వత్తులను చేసుకొనుచుండును. జపమునకు కొనుక్కొనిన పగడాల తావళమును త్రిప్పుచుండును. అరవతల్లి మంగళాంబ అప్పుడప్పుడు త్యాగయ్య కీర్తనలను పాడుచుండిన చీదరించుకొనుచుండును. సంసార స్త్రీ సంగీతమును పాడగూడదట. ఇదియే కావేరితీరమున పుట్టిన అరవతల్లికి, గుళ్లకమ్మవడ్డున పుట్టిన తెలుగుతల్లికి భేదము.
మంగళాంబను చూచి అయినను నీవు మంచిమార్గములను నేర్చుకొనరాదాయని నేను అదలించి కోపించినపుడు 'పొయిబొగ్గులను, పాతగుడ్డలను అమ్ముకొని పొట్టపోసుకొను దరిద్రురాలిని చూచి నేను నేర్చుకొనువిద్య లేమున్న'వని జవాబు చెప్పుచు కంటనీరు కార్చుచుండినది. ఎండకాలమున వడపెట్టు తగలకుండగను వడగడ్డలు రాకుండగను అంగారకగ్రహ దోషనివారణకు మాయింటి పురోహితుడు కడప సుబ్బయ్యశాస్త్రికి కందిపప్పును, ఉర్లగడ్డలను దానమిచ్చుచుండినది. ఫలాని ఋతువులో ఫలాని దానము లివ్వవలయునని పురోహితుడు వచ్చి ఈ అమాయకురాలితో చెప్పిపోవుచుండును. ఆ పురోహితుడు నేను సమకాలికులము. ఇప్పుడుకూడ అప్పుడప్పుడు పండుగలకు వచ్చి ఆ చనిపోయిన మహాతల్లిని స్మరించి చేతులెత్తి నమస్కరించి పోవుచుండును.
మేము కాపురముండిన యింటిలో కొళాయి లేనందున ప్రక్కయింటి కోమట్ల కొళాయిలో మంచినీళ్లను తెచ్చుకొనుచుంటిమి. ఆయింటి శెట్టి దరిశారంగనాధమును, నేనును స్కూలులో కూడ