చిన్ననాటి ముచ్చట్లు 45
భోజనమునకు పోవుటకు బరంపురం వంగపండుచాయ పట్టుతాపు తాను కొని యిచ్చితిని.
తెలుగుతల్లికి తన చీరలను తాను వుతుక్కొని ఆరవేసుకొను అలవాటు లేదు; గనుక పనిమనిషి వద్ద యిచ్చి వుతకమనుచుండినది. ఆ చీరెలను పనిమనిషి పేడలోను మట్టిలోను పార్లించి రాతిమీద వుతుకునపుడు రాతికి బొక్కెనకు తగులుకొని చీరెలు చినుగుచుండినవి. పట్టుచీరెలను కట్టుకొని విందు భోజనములకు పోయి నేతిచేతులను కట్టుకొన్న చీరకు తుడుచుకొని యింటికి వచ్చి ఆ చీరను మడిచి యొకమోలను పెట్టుచుండినది. చేతులు తుడిచిన నేతివాసనకు రాత్రిళ్లు యెలుకలు వచ్చి ఆ చీరను వెయిగండ్ల చీరనుచేసి పోవుచుండెడివి. ఆ చినిగిన చీరెను సుమంగలి కట్టుకొనిన దరిద్రము వచ్చునను పనివార్లకు పంచిపెట్టుచుండినది. అప్పుడప్పుడు పాత చీరలను యిచ్చి సూదులను, మాయపగడాల దండలను కొనుచుండినది. ఇందువలన తెలుగుతల్లికి యెప్పడు గుడ్డలకు కఱవుగనే యుండెను. చీరె యెండలో ఆరినగాని మడికి పనికిరాదని ఈమె వాదించుచుండెను. కనుక ఈమె పట్టుచీరెలను మిద్దెమీద యెండ వేయుటవలన రంగు పట్టుచీరలన్నియు తెల్లపట్టు తాపుతా లగుచుండినవి. తెలుగుతల్లికి అరవతల్లికివలె క్లుప్తముగ వంటచేసుకొనుటకు తెలియదు. మాకు వండిన వంటకములు మరి ముగ్గురకు కూడ సరిపోవుచుండెను. మిగిలిన అన్నముతో పనిమనిషి సంసారమును, పందికొక్కుల సంసారమును కాపాడుచుండెను. ఈమె వంగవోలు వంట చాలా రుచిగను, పరిశుభ్రముగను చేయుచుండినది.
మా వంగలోలాబిడకు చదువు సున్నా, కుట్టుపని రాదు. అప్పడము లొత్తుట అసలే తెలియదు. కనుక ఈమె భోజనానంతరము కొంగుపరచుకొని సుఖనిద్ర ననుభవించుచుండెను.