44 చిన్ననాటి ముచ్చట్లు
రమ్మనెదను. ఆనాడు అరవ కుటుంబమంతయు మా యింటనే భుజింతురు. భక్ష్యములకుగాను చంటిబిడ్డకు కూడ ఆకువేసి కూర్చుండబెట్టెదరు. ఆ రాత్రి మజ్జిగ త్రాగి పరుండెదరు.
మేము కూరలకు నూనెవాడిన తల తిరుగును గనుక అన్నిటికి నేతినే వాడుచుంటిమి. ఈ కారణములవల్ల నా నెలజీతము నేతికి కూడ చాలకుండెను. ఆ కాలమున మంచి నేతిని వీశ రూ. 1-4-0 కు అమ్ముచుండిరి.
ఒక వైద్యుడు కాకరకాయలో క్వయినా గలదు గనుక దినము తినుచుండిన మలేరియా జ్వరము రాకుండుటయేగాక మంచి ఆరోగ్యముకూడ కలుగునని చెప్పినందున నేను ప్రతిదినము కొత్వాలు చావిడి మార్కెట్టుకుపోయి మంచి పెద్ద కాకరకాయలను తెచ్చుచుంటిని. ముళ్లవంకాయలు చిన్నవి (కర్పూరపు వంకాయలు) రుచికరముగ నుండును గనుక వాటిని తెచ్చుచుంటిని. దేశవాళి గోంగూర కనబడిన విడుచువాడను గాను. ఒంగోలువారికి పచ్చళ్లలోకూడ పచ్చిమిరపకాయలను కొఱుకు కొనుట అలవాటున్నందున వాటిని తెచ్చుచుంటిని. పచ్చిమిరపకాయలో మంచి వైటమిన్ వున్నట్టు నవీన వైద్యవేత్తలు కనుగొనిరి.
మా ఆబిడ మద్రాసుకు వచ్చునపుడు నేను పెండ్లినాడు పెట్టిన రోజారంగు బనారసు సరిగ చీరను, బాలామణి చీరను, చిలుకపచ్చ సాదా పట్టుచీరెలను, తల్లిగారు పెట్టిన ముదురు లేత చుట్టుచంగాయి చీరెను, కోటకొమ్మంచు వేసిన తెల్లచీరెను తనతో కూడ తెచ్చుకొనెను. మద్రాసుకు వచ్చిన పిమ్మట మూడుచుక్కల మధుర చీరెను, బందరుచాయ గువ్వకన్ను చీరెను, సాదారంగు చీరెలను నేను కొని యిచ్చితిని. వర్షాకాలమున మడికట్టుకొనుటకు నారమడి చీరెను పెండిండ్లకు మడికట్టుకొని