పుట:Chinnanati Muchhatlu K N Kesari 1999 206 P.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిన్ననాటి ముచ్చట్లు 41

కీర్తనలనుకూడ పాడుచుండెను. భర్త యింట నుండిననాడు, ఈ తల్లిపాటలు నేను వినగోరినప్పడు అడ్డుచెప్పక పాడుచుండెను. కావేరి తీరమున పుట్టిన పుణ్యాత్ములందరు చక్కగ పాడనేర్చినవారె.

మంగళాంబ ఒడ్డుపాడుగు కలిగిన మంచి విగ్రహము. తెల్లవారగనే స్నానముచేసి కురులను కురచగ దూముడి వేసుకొని పట్టుకోకను కట్టుకొని కుంకుమను పెట్టుకొనినప్పడు మంగళాంబ కామేశ్వరివలె కళకళలాడు చుండెడిది. ఈమెకు పరిశుభ్రతయే మంచి మడి, ఆచారము.

మంగళాంబ ప్రతిదినము తెల్లవారగనే చన్నీళ్ల స్నానమును చేయుటవల్లను అభ్యంజనమునాడు తలకు చీకిరేణి పాడిని వాడుటవల్లను ఆమె కురులు నున్నగను, నల్లగను పట్టు కుచ్చువలె నుండెడివి. చన్నీళ్ళ స్నానము వలన మన మెదడు చల్లబడి కురులు పొడవుగ పెరుగును. కావేరీ తీరవాసులకును, మలబారువారికిని తెల్లవారగనే శీతలోదకమున స్నానము చేయు అలవాటు గలదు. మలబారువారు తలకు బెండాకును రుద్దుకొనెదరు. చీకిరేణి పొడిలోను, బెండాకులోను జిరుగుపదార్థ ముండుట వలన వెంట్రుకలు బిరుసుగ నుండవు.

వంగోలు ప్రాంతమున తలంటు స్నానమునాడు సాధారణముగ కుంకుడుకాయల నురుగుతో తల రుద్దుకొనెదరు. కుంకుడుకాయల నురుగు అత్యుష్ణముగనుక తల వెంట్రుకలు వరిగడ్డి వలె గరగరలాడు చుండును. తలవెంట్రుకలు చిట్లిపోయి కురచబడును. త్వరలోనే వెంట్రుకలు తెల్లబడి పండ్లూడిపోవును. మా ఆవిడ మంగళాంబను చూచి అయినను నేర్చుకొనక పుట్టింట అలవాటును మార్చుకొనజాలక కుంకుడు కాయలనే వాడుకొనుచుండినది.

తలకు చల్లనీళ్లను, వంటికి వేడినీళ్లను వాడుకొనుట మంచిది. కొందరు తలలోని పేలు ఈపి నశించిపోవుటకు మసిలెడు నీళ్లను పోసెదరు. ఇందువలన కొందరు సొమ్మసిల్లి మూర్చపోవుటకూడ తటస్థించును.