Jump to content

పుట:Chinnanati Muchhatlu K N Kesari 1999 206 P.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

40 చిన్ననాటి ముచ్చట్లు

తెచ్చియిచ్చును. ఈపైకముతో మంగళాంబ యింటి ఖర్చు నంతయు పొదుపుగ గడిపి సంవత్సరమునకు రూ. 20 లు కూడబెట్టుకొనును. వంటచేసిన పొయిలోని నిప్పును చల్లార్చి, ఆ బొగ్గులను కళాయి పూయువారికి అమ్మును. పాతగుడ్డలనిచ్చి పరకకట్టలను కొనును. పాతచీరలలో చించిన సరిగ పేటునిచ్చి కంచులోటాలను గాజు టంబర్లను కొనును.

ఈవిధముగ అరవతల్లి సంసారమును జాగ్రత్తగా గడుపుకొనుచు భర్తయిచ్చిన పైకములో మిగుల్చుకొనిన రూ. 20 లతో కూడ చిల్లర సంపాద్యమును కలిపి, దీపావళి పండుగనాడు కొర్నాడు పట్టుచీరెను కొని కట్టుకొనును. ఆ కాలమున పాతిక రూపాయలకు మంచి కొర్నాడు చీరె వచ్చుచుండెను. పేరంటములకు, దేవాలయములకు ఈ చీరెనే కట్టుకొని పోవుచుండినది. తన చీరెను తానే వుతుకుకొనుచుండినది. తెల్లవారగనే స్నానముచేసి ఆ చీరెను కట్టుకొని దినమంతయు గుడపుచుండినది. ఆ చీరెను యెప్పడు చూచినను అప్పడే అంగడినుంఛి తెచ్చినట్లు కనుబడుచుండినది. ఈమెవద్ద పాత పండుగ చీరెలుకూడ కొన్నియుండెను. ఈ చీరెలు కూడ క్రొత్తచీరెలవలెనే కనుపడుచుండెను. గనుక ఈమె గుడ్డల దరిద్రములేకుండ కాలమును గడుపుచుండినది.

ఈ అరవతల్లికి భోజనానంతరము నిదురబోవు దురలవాటు లేదు. కుట్టుపనినిగాని, చదువుకొనుటగాని, అప్పడాలు వత్తుటగాని ఆమె చేయుచుండును.

చంటిబిడ్డ యేడ్చినపుడు గుడ్డ ఉయ్యాలలో పరుండబెట్టి జోలపాటలను పాడుచుండును. అప్పడప్పడు త్యాగయ్యగారి కృతులను కంఠమెత్తి శ్రవణానందముగ పాడుచుండినది. భక్తిరసముగల పురందరదాసు