Jump to content

పుట:Chinnanati Muchhatlu K N Kesari 1999 206 P.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

36 చిన్ననాటి ముచ్చట్లు

వంగోలాడబిడ్డకు అరవభాష అయోమయముగా నుండెను. అయితే అరవ గృహలక్ష్మి, ఆంధ్ర గృహలక్ష్మి వద్ద కొలది కాలములోనే తెలుగుభాషను చక్కగ నేర్చుకొని మాతో ధారాళముగ సంభాషించుటకు తయారైనది. తెలుగు గృహలక్ష్మి ఆరవభాషను వెక్కిరించుటకు తయారైనది. నేను మా ఆవిడను 'అరవమును నేర్చుకొనరాదా'యని హెచ్చరించినపుడు 'ఆ అరవమొత్తుకోళ్లు, ఆ చింతగుగ్గిళ్లు నాకక్కరలే'దని చీదరించుకొనుచుండెడిది.

అరవలు ఆంధ్రదేశమునకు డిప్టీ కలెక్టర్లుగను, అయ్యవార్లుగను, లాయర్లుగను, ఇంజనీర్లుగను వచ్చి కొలదికాలములోనే తెలుగుభాషను చక్కగా నేర్చుకొని వ్యవహారములను తెలుగువారికంటె నేర్పుగ నెరవేర్చుకొనుచుండుట తెలుగువారికి తెలిసిన విషయమే. అరవలాయర్ల ఆడవారు పురుషులకంటే ముందుగనే తెలుగు నేర్చుకొని కక్షీదార్లవద్దనుంచి ఫీజును నిర్ణయించుకొనుచుండిన విషయమును, ఫీజునుమించి సప్లయిలను రాబట్టుచుండిన సంగతిన్నీ కూడ నాకు దెలియును. అరవవారి బిడ్డలు తెలుగుబళ్లలో చదువుకొని ఆంధ్రభాషా ప్రవీణులయినవారిని కొందరిని నాకు దెలియును. అట్టివారిలో నేడు తెలుగుపత్రికలలో తరుచు వ్యాసములు వ్రాయుచుండు శ్రీరామచంద్ర అగస్త్య యం.ఏ. గారున్నూ, వారి సోదరియు తెలుగువారికి బాగుగా పరిచితులు.

మన ఆంధ్ర సోదరులు చిరకాలముగ మద్రాసును స్థిరవాసముగ నేర్పరచుకొని, స్థిరాస్తులను సంపాదించుకొని యుండినను అరవ భాషను ధారాళముగ మాట్లాడుటకు అసమర్థులైయున్నారు. ఇందుకు ముఖ్య కారణము అకారణమగు అసూయ. తెలుగు లాయర్ల వద్దకు అరవకక్షీదార్లు రాకపోయినను అరవవారివద్దకు తెలుగువారు పోవుచునేయున్నారు. తెలుగువారే కొందరు ఆంధ్ర రాష్ట్రోద్యమమును వ్యతిరేకించుచుండగా ఆంధ్రదేశములో (నెల్లూరులో) నివసించుచుండిన అరవవారగు సంతాన