7
తొలి కాపురం
వివాహమైన మూడు సంవత్సరములకు నా భార్య యింటికి వచ్చెను. ఆమె వచ్చిన వెంటనే మద్రాసులో క్రొత్త కాపురమును పెట్టవలసి వచ్చినది. నా బాల్య స్నేహితుడగు అన్నం చెన్నకేశవుల శెట్టిగారికి ఆచారప్పన్ వీధిలో యొక యిల్లుండెను. ఆయింటిలో వారు మమ్ములను కాపురముంచిరి. అన్నివిధముల వారు మమ్ములను కనిపెట్టుచుంటిరి. వారి యింటిలో కొంతకాలముండి మరియొక యింటికి మారితిమి.
నా గృహిణి కొన్ని గ్రహములతో కూడ నా గృహము చేరినది. ప్రతిదినము యేదో గ్రహము ఆమెకు సోకటము, తల ఆడించడము, కేకలు వేయడము దగ్గరకు పోయిన తన్నడము, పీకడము, కొరకడము! ఈలాగున యింటిలో గ్రహములు తాండవమాడుచుండెను. మాకు తోడు యెవరు లేరు. పొరుగున అరవ కాపురము; దయ్యాలతో కూడ ఆ యింటిలో మేముండుట అరవలకు యిష్టము లేదు. క్రమముగ నా భార్య మెడనిండుగ లెఖ్కలేనన్ని రక్షరేకులకు తావు కలిగెను. పలువిధములయిన రుగ్మతలతో బాధపడుచు మంచమెక్కుచుండెను.
నాతో కూడ అరవ బడిపంతులు కాపురముండెను. ఆ పంతులు పేరు వెంకటేశయ్యరు. భార్య పేరు మంగళాంబ. వీరికి యిరువురు బిడ్డలుండిరి. ఈ బడిపంతులుకును, నాకును మాసమునకు రూ. 20 లు మాత్రమే వరుంబడి యుండెను. మేముండిన యింటిలో యొక భాగమునకు రూ. 1-6-0 నెలకు బాడుగను నేనిచ్చుచుంటిని. మరియొక భాగమునకు అయ్యరు నెలకు రూ. 2 లు యిచ్చుచుండిరి. వారిది తంజావూరు ప్రాంతము. మాది వంగోలు ప్రాంతము. నాకు కొద్దిగ అరవము తెలిసినను