Jump to content

పుట:Chinnanati Muchhatlu K N Kesari 1999 206 P.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

28 చిన్ననాటి ముచ్చట్లు

మందగమన : ఓసీ పిచ్చిచెల్లీ! ఈ మాత్రమునకేనా నీవు వ్యసనపడడము? నీకంటె పదిరెట్లు హెచ్చుగ కష్టముల ననుభవించిన దానను. ఇవిగో చూడు నా చేతి మీద వాతలు; వీపుమీది కొరడా దెబ్బల మచ్చలు. అయితే ఇప్పడు నేను, నాభర్త యొకరినొకరు క్షణమాత్రమైనను విడువజాలనంత అనురాగమున సుఖముగ నున్నాము. ఇందుకు కారణము మా ప్రక్క యింటి సరస్వతియే. ఆమె యెప్పుడును 'ఆంధ్ర ప్రకాశిక' పత్రికను చదువుచుండును. ఆమె నాకు చెప్పిన రహస్యము వల్లనే ఇప్పటి మా యిరువురి స్నేహము; దానిఫలమే ఈ చిట్టికూతురు వాసంతిక.

సుందరాంగి  : అక్కయ్యా! నీకు నమస్కరించెదను. ఆ రహస్యమును నాకును చెప్పి పుణ్యమును కట్టుకొనవే.

మందగమన : చెప్పెదను వినుము, సుందరీ. మద్రాసులో ′కేసరి కుటీర′ మను యొక వైద్యశాల కలదు. ఆ వైద్యశాలలో 'తాంబూలరంజిని' అను పడకటింటి తాంబూలములో వేసుకొను పరిమళ మాత్రలను విక్రయించెదరు. ఆ మాత్రల వెల బుడ్డి 1-కి నాలుగు అణాలు మాత్రమే. వాటిని నీవు కూడ తెప్పించుకొని నీ భర్తకిచ్చు తాంబూలమున నుంచి యిచ్చిన వారము దినములకే నీ భర్త నీ స్వాధీనమై, నీకు దాసానుదాసుడగును. గనుక నీవు వెంటనే ఇంటికిపోయి కేసరి కుటీరమునకు కార్డును పంపుము.