20 చిన్ననాటి ముచ్చట్లు
ఆడువారు తమ తమ బంధువుల ఇండ్లకు నన్ను పంపి, వారి ఇంట్లో యేమేమి కూరలు, ఫలహారములు చేసుకొన్నదిన్నీ, వచ్చే ఆదివారమునాడు ఆళ్వారు శెట్టిగారింట్లో జరుగబోవు పెండ్లికి ఆ యింటి భాగ్యశాలి యేమి చీరె కట్టుకొని రాదలచినదిన్నీ - మొదలుగాగల వర్తమానములను తెలుసుకొని రమ్మనేవారు. ఈ సమాచారములు తెలిసి రాగలిగినందుకు వారు నాకు అప్పుడప్పుడు డబ్బును, వస్త్రములను బహూకరించుచుండెడివారు. వీరి పరిచయము వల్ల క్రమముగ నాకు అన్నవస్త్రముల కరువు తీరినది. వైద్యమును నేర్చుకొన్న పిదప ముఖ్యముగ ఈ కోమట్ల ఇండ్లలో హెచ్చుగా వైద్యము చేయుట కవకాశము కల్గినది. వీరు నాకు రాజపోషకులైరి.
పిమ్మట వారి సహాయ్యముననే శ్రీ కన్యకా పరమేశ్వరీ ఆయుర్వేద ధర్మవైద్యశాలలో నౌకరిని సంపాదించుకొంటిని. ఏలననగ ఈ ధర్మ వైద్యశాల వారి కులదేవతయగు శ్రీ కన్యకా పరమేశ్వరీ దేవాలయపు ధర్మకర్తలచే స్థాపింపబడినది. ఈ దేవాలయములో ప్రతిదినము పేదబ్రాహ్మణ విద్యార్థులకు, అన్నమును పెట్టుచుండిరి. ఆ కాలమున వైశ్యులకు బ్రాహ్మణభక్తి ఇప్పటికన్న అధికముగా నుండుటచే అన్నదానము ధారాళముగా జరుగుచుండెను.
ప్రతి సంవత్సరమును శరన్నవరాత్రములలో ఉత్సవములకు ఈ కన్యకా పరమేశ్వరీ దేవాలయమున 9 దినములు బ్రాహ్మణ సంతర్పణ జరుగును. ఈ సంతర్పణలలో ప్రతిదినము 2000 బ్రాహ్మణులకు తక్కువలేకుండా భోజనమును చేయుచుండిరి. ఇక్కడ తయారుచేయు భోజన పదార్థములు వంకాయకూర, చారు వగైరాలు చాలా ప్రశస్తములుగా నుండెడివి. ఇట్టి అద్భుత పాకకళా నిపుణులలో ముఖ్యముగా బుర్రా కుటుంబయ్యగారు, భీమవరం కాపురస్తులగు ములుకుట్ల సుబ్బయ్య,