చిన్ననాటి ముచ్చట్లు 13
చమటలు పోయుచు అలసటచే రొప్పుచుండెను. నేనామె అవస్తను చూచి, రోడ్డు వార నామెను కూర్చుండమని చెప్పి నేనున్నూ కూర్చుంటిని. ఆ కూర్చుండిన చోటు సెంట్రల్ స్టేషన్ గేటు ఎదురుగా జనరల్ హాస్పిటల్ ఆవరణపు గోడ ప్రక్కన. ఇప్పటికిని నేనాప్రక్క వెళ్లినప్పడెల్ల పూర్వ స్మృతితో ఆ ప్రదేశమును గమనించి చూచుచుందును. అక్కడ కొంత విశ్రాంతి తీసుకొని ఒంటెద్దు బండి మీద యిరువురము యింటికి చేరితిమి. అప్పడు నాతో కూడవచ్చిన వాని తల్లి 'మావాడెక్కడ' యని అడిగెను. కాని నాకు వెంటనే నోట మాటరాక కొంతసేపటికి జరిగిన సంగతినంతయు తిన్నగా చెప్పితిని. వెంటనే ఆమె తన బిడ్డకొరకు పార్కునకు పరుగెత్తినది గాని, రాత్రి యంతయు అక్కడ వేచియుండి పిల్లవానిని గుర్తించలేక, తెల్లవారిన పిదప నిరాశతో ఆతల్లి యిల్లు చేరినది. చెన్నపట్నమున ఆనాటి దుర్దినం ఆవిధముగా గడిచిపోయినది.
3
ఇద్దరు తల్లుల చలవ
రాణితోటలో ప్రదర్శనశాల తగులబడిపోయిన పిమ్మట నా తల్లి నన్ను ఒంటరిగ మద్రాసులో విడిచిపెట్టిపోలేదు. మేమిరువురము మద్రాసులో యుండవలసివచ్చినది. నేను బడిలో చదువుకుంటూ యిద్దరు వర్తకుల పిల్లకాయలకు బడిపాఠములను చెప్పచుంటిని. వారు నాకు నెలకు చెరియోకరు 2-8-0 లు ఇచ్చేవారు. ఈ రూ.5 ల వరుంబడితో ఇద్దరము మద్రాసులో బ్రతుకుటకు కష్టమైనది. నా తల్లి ఒక కోమటి ఇంట్లో