196 చిన్ననాటి ముచ్చట్లు
అప్పటినుంచీ ఇప్పటివరకు, ఈ వృత్తిలో కూడా నాకు చాలా కష్టములు కలిగినప్పటికి వాటినన్నిటినీ జయించుకొని, కొన్ని సంవత్సరములుగా ఏ ఇబ్బందియు లేక స్థిరపడినాను. ఇదీ నా నిజవృత్తాంతము.
'ఇన్ని కష్టములు పడిన్నీ చేసిన ఘనకార్యములేమిటి' అని మీరు నన్ను అడుగవచ్చును. చెప్పెదను.
చిన్నతనంలో ఇల్లు వాకిలి లేనివానినిగా చేసి నన్ను, రావిచెట్టు క్రింద కాపురము చేయించినందుకు - దేవుని మీద కోపం వచ్చి - నివసించడానికి మంచిభవనాన్ని నిర్మించుకున్నాను.
చిన్ననాడు విద్యకై పడిన కష్టములు మరువజాలక ఈ విద్యాలయం స్థాపించినాను.
చదువుకొనునప్పుడు నన్నాదరించి నాకు అన్నముపెట్టిన అమ్మల అమృతహస్తములను ఏటేటా 'గృహలక్ష్మి స్వర్ణకంకణము" అనే పేరుతో బంగారు తోడాలను తొడుగుతున్నాను.
ఇప్పడు మరొక కార్యం చేయదలచుకొన్నాను. నన్ను ఈ స్థితికి తెచ్చినది స్త్రీల ఆరోగ్యమునకై తయారుచేయబడుచుండిన 'లోధ్ర' అనే ఔషధరాజము. ఈ ఔషధమువల్ల నాకింత సంపాద్యము చేకూరినది. ఈ దినం స్త్రీల విద్యాభివృద్ధికై - లక్ష రూపాయలను స్కూలు కమిటీ పరముగా ఇచ్చుచున్నాను. ఈ ధనం వెచ్చించి "కేసరీ కన్యావిద్యాలయం" అనే పేరుతో ఆడబిడ్డలకు ప్రత్యేకంగా ఒక విద్యాలయం నెలకొల్పండి - అని ఈ కమిటీ వారిని కోరుచున్నాను.
'క్షణం చిత్తం క్షణం విత్తం క్షణం జీవిత మాపయోః
యమస్య కరుణా వాప్తి ధర్మస్య త్వరితా గతి'