చిన్ననాటి ముచ్చట్లు195
ఎంతకాలం అట్లా మర్ధనచేస్తే నాకు విద్య అంటుతుంది? ఆయనను వదిలిపెట్టినాను.
మహదేవ శాస్త్రిగారు వైద్యశాస్త్రం తెలిసినవారు. వారివద్ద కొంతవరకు శాస్త్రరీత్యా విద్య నేర్చినాను. వైద్యగ్రంథములు చదివి వైద్య రహస్యములు బోధపరుచుకున్నాను. కొన్ని మందులను తయారుచేసి, కోమట్ల ఇండ్లలో వైద్యం చేసేవాడను. శ్రీ పాలూరి రాజం శెట్టిగారు నీలిమందు వర్తకం చేసేవారు. వర్తకులలో ప్రముఖులు, కన్యకా పరమేశ్వరీ దేవాలయపు ఆస్తికి ట్రస్టీలలో ముఖ్యులు, సరిగా ఆ కాలమందే వారు కన్యకా పరమేశ్వరీ ధర్మ ఆయుర్వేద వైద్యశాల అని యొకటి స్థాపించినారు. దానిలో శ్రీ పండిత డి. గోపాలాచార్యులు గారిని వైద్యులుగా నియమించినారు. శ్రీ రాజంశెట్టిగారికి నేను తరచుగా పుల్లటి మందులు పెడుతూ ఉండేవాడిని. వారు దానికని నాయందెంతో దయగా ఉండేవారు. ఆ పరిచయంచేత వారు మిగత ట్రస్టీలకు సిఫారసుచేసి, నన్ను కూడా ఆ కన్యకా పరమేశ్వరీ ట్రస్టు ధర్మాయుర్వేద వైద్యశాలలో ఆచార్లగారికి సహాయ వైద్యులుగా నియమింపచేశారు. నేనూ ఆచార్లు గారూ కలిసి ఆ వైద్యశాలలో, 4 సం||లు పనిచేశాము. పిదప వారికీ నాకూ సరిపడలేదు. నేను ఆ ఉద్యోగానికి రాజీనామా నిచ్చినాను. స్వయంగా, స్వతంత్రముగా 'వైద్యాలయం' ఏర్పాటు చేసుకొని, పొట్టపోసుకోదలచినాను. ఆ ధర్మవైద్యశాల యుండిన నారాయణ మొదలి వీధిలోనే, ఒక ఇల్లు నెల 1కి రూ. 1-6-0 కి బాడుగకు తీసుకొని, వైద్య మారంభించాను. మందులు చేసుకోడానికి కాపురముండడానికీ అదే యిల్లు. ఈ నూతన యత్నారంభం చేసిన రోజుననే - ఆయింటి వీధిగోడమీద, బొగ్గుతో, పెద్ద అక్షరాలలో, 'కేసరి కుటీరం - ఆయుర్వేద ఔషధశాల' అని వ్రాశాను. అదే నా అదృష్ట రేఖ ధరించిన మొదటి సైన్ బోర్డు (Sign Board)