పుట:Chinnanati Muchhatlu K N Kesari 1999 206 P.pdf/202

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

194 చిన్ననాటి ముచ్చట్లు

మెట్లు ఎక్కడం, దిగడం, నెల అయిపొయింది. అన్నానికి ఇబ్బందిగా ఉన్నది; జీతం ఇవ్వండి అన్నాను. 'ఇంకా పని నేర్చుకోనిదే; రెండు మూడు నెలలు నేర్చుకున్నాక - జీతం ఆలోచిద్దాము' అన్నారు. ఎన్నాళ్లు గౌను, "లా" పుస్తకాలు నెత్తిన పెట్టుకొని మోస్తూ - హైకోర్టుమెట్లు ఎక్కే, దిగే విద్య నేర్చెదను అని నాకు తోచింది. ఆ దినంతో దానిని వదులుకొన్నాను.

అప్పడే క్రొత్తగా 'ట్రాంబండి' వేసినారు. ట్రాంబండ్లలో కండక్టరుగా చేరుదామని బుద్దిపుట్టినది. దరఖాస్తు వేశాను. 'ఖాళీలేదు" అని జవాబిచ్చారు. అది అట్లా తొలగిపోయింది.

ఎవ్వరి సలహాలేకుండా నాలో నేను ఆలోచించుకో నారంభించాను. ఏదైనా ఉద్యోగం చేసే బ్రతకవలెను అనే నిశ్చయం ఇంకా దృఢపడ్డది. ఆ ఉద్యోగం, ఒకరి సలహా, సిఫారసు లేకుండా దొరకవలెను. అప్పటికీ ఇప్పటికీ - చెన్నపట్నంలో, రెండు ఉద్యోగాలు హెచ్చు విద్య అవసరం లేకుండా, ఏ సిఫారసు లేకుండా దొరికేవి ఉన్నవి. అందొకటి బ్రోకర్ పని, దీనికి తలగుడ్డ, కోటు, వల్లెవాటు, చేతికర్రో, గొడుగో, చెప్పులు. ఇట్టాకొంత వేషం, భేషజం ఉండవలె.

రెండవది : నాటు వైద్యం. ఆయుర్వేద వైద్య విద్య నేర్పే పాఠశాలలు ఆ రోజుల్లో మద్రాసులో లేవు. ఆ వైద్యవిద్య తెలిసినవారి వద్ద గురుకుల వాసం చేసి నేర్వవలసినదే. ఒక నంబి ఆచార్లవద్ద, ఒక శాస్త్రులగారివద్ద ఆ విద్య నేర్చినాను. ఆ నంబి ఆచార్లగారికి శాస్త్రము విశేషమేమీ తెలియదు. తాతముత్తాతల నాటినుండి అనుశృతంగా వచ్చే వైద్యవృత్తి మాత్రం అవలంబించినారు. వారుచేసిన కుప్పెకట్టు కొన్ని వీరివద్ద ఉన్నవి. వాటిసహాయంతో అనుభవంకొద్దీ ఆయన 'సంచికట్టు' వైద్యం సాగించేవారు. ఆయన నాకు నేర్పగలిగిందేముందు? ఏదో ఇంతమందు కల్వంలో వేసి, ఇన్ని నిమ్మపండ్ల రసం పిండి మర్దన చేయమనేవారు.