చిన్ననాటి ముచ్చట్లు193
పుస్తకాలకు, గుడ్డలకు - ఆ ప్రాంతంలో వ్యాపారం చేసుకొనే కోమట్లవద్ద నెల 1 కి తలా రూ. 0-4-0 చందా ఇచ్చే ఏర్పాటు చేసుకొన్నాను. ఒకనాడు కొన్ని పుస్తకాలు కొనవలసి వచ్చినది. ఇంకా నెలసరి చందాలిచ్చే గడువు రాలేదు. జార్జిటౌను ఆదియప్ప నాయక్ వీధిలో పై చందాలిచ్చేవారిలో వకరి వద్దకు వెళ్ళి - 'మీరు మామూలుగా ఇచ్చే రూ. 0-4-0 లు అటుంచి - మరొక్క పావులా అదనంగా ఈరోజున ఇవ్వండి; పుస్తకాలు అగత్యంగా కొనవలెను' అని సాహసించి అడిగినాను. వారు దగ్గరకు రమ్మనిన, అడిగన తడవుగానే ఇవ్వబోతున్నారనే ఆశతో, ధైర్యముతో దగ్గరకు వెళ్లినాను. 'మామూలుగా ఇచ్చే పావులా గాక పైన ఒక పావులా వడ్డీగూడా కావాలా' అంటూ - చెళ్ళున చెంపకాయ గొట్టినాడు. అది దూసిపోయి నెమరు కణతన తగిలినది, స్పృహతప్పి పడిపోయినాను. ఆ శబ్దం విని సెట్టి భార్య లోపలనుంచి వచ్చినది. నా అవస్థచూచి 'ఆ పిల్లవానిని ఎందుకు అల్లా కొట్టా'వని మగని గద్దించి - చాలా నొచ్చుకొన్నది. లోపలకు వెళ్లి ఇన్ని మంచినీళ్లు తెచ్చి త్రాగమని ఇచ్చినది; త్రాగినాను. స్పృహ బాగా వచ్చిన తర్వాత ఆమె రూ. 1-0-0 తెచ్చి పుస్తకాలు కొనుక్కోమని నా చేతిలో పెట్టి పంపినది. రావిచెట్టు క్రిందకు చేరాను. తిరగీ జిజ్ఞాసలో పడ్డాను. రిక్తుడను. అవమాన పరంపరలతో చదువు సాగించడం దుర్లభమని తోచింది. నాకూ ఈ చదువుకూ దూరమని నిర్ణయించుకున్నాను. ఏదైనా నాకు తగిన ఉద్యోగంచేసి సంపాదించి పొట్టబోసుకుందాము అని యోచన కలిగింది.
ఏమి ఉద్యోగం చేతుమా అని ఆలోచింప నారంభించాను. ప్లీడరు గుమాస్తా చేయమని ఒకరు సలహా యిచ్చారు. ఒక వకీలుకు సిఫారసు చేసినారు. వారివద్ద గుమాస్తాగా చేరినాను. ఆ వకీలు నెలపూర్తి అయితేగాని జీతమివ్వబడడు, పని నేర్చుకో అన్నారు. నాకప్పచెప్పబడిన పని - వకీలుగారి గౌను, ఇంతంత 'లా' పుస్తకాలు - ఎద్దుమోత నెత్తిన పెట్టుకొని హైకోర్టు