Jump to content

పుట:Chinnanati Muchhatlu K N Kesari 1999 206 P.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

12 చిన్ననాటి ముచ్చట్లు

గంభీర పురుషుడు. వీరు శ్రీ కన్యకా పరమేశ్వరీ దేవాలయపు ధర్మకర్తలు. వారు అప్పుడప్పు డాదేవాలయమునకు వచ్చుచుండేవారు. వారప్పుడు మొగమునిండ విభూతి పూసుకొని దానిపైన యర్రటి కుంకుమబొట్టు పెట్టుకొని, జోడు గుర్రముల ఫీటను బండిలో కూర్చుండి జోడు వింజామరలతో, ఇల్లు బయలుదేరి పరమేశ్వరి దర్శనార్ధము దేవాలయమునకు వచ్చునప్పుడు వారికి జరుగుచుండిన గౌరవము, మర్యాద ఇప్పడీ ప్రాంతమునకు వైస్రాయిగారు వచ్చినా వారికిన్నీ జరుగజాలదు. శెట్టిగారు దేవాలయమునకు వచ్చెదరన్న సంగతిని జనులకు తెలుపుట కొరకు దేవాలయములోని పెద్దగంటలను మ్రోగించేవారు. ఈగంట శబ్దమును విన్న వారందరును ఆదర బాదరగా నడుములకు పైపంచల కట్టుకొని, వీధి గుమ్మమున నిలువబడిశెట్టిగారికి రాగానే దాసోహముల సమర్పించేవారు. వీరి ఆస్థిపాస్థుల పరిమితి చెప్పవలయునంటే - ప్రస్తుతము హైకోర్టు దాని చుట్టుప్రక్కల కొన్ని బిల్డింగులుగల ప్రదేశమంతయు - నాడు వారి స్వంతము అని చెప్పిన చాలును.

ఇక నా సంగతి ఏమైనదో చెప్పెదను. నేను ప్రదర్శనమును చూచుటకు లోనికి పోకుండ బయటనుండి ప్రాణముల కాపాడుకొంటిని; నాతో కూడ వచ్చిన బాలుడు కనబడకుండుటచే చాలాదూరము వెలుపల గేటువద్ద నిలుచుంటిని గాని వాడు కానరాడాయెను. అప్పడు నేను వంటరిగా ఇంటివైపునకు తిరిగి పోవుచుండిని. నేను సెంట్రల్ స్టేషన్ ఎదుటికి వచ్చుసరికి నాపేరుపెట్టి పెద్దగా పిలుచుచూ ఆత్రముతో మాతల్లి పార్కువైపునకు పరుగెత్తుచుండెను. ఆమె గొంతును నేను గుర్తించితిని. వెంటనే పరుగెత్తి పోయి ఆమె ఎదుట నిలువబడితిని. అప్పడు మా అమ్మ నన్ను కౌగలించుకొని నిట్టూర్పు విడిచెను. ఆమె ఈప్రదర్శనము కాలిపోయిన వార్త విన్న వెంటనే పరుగెత్తుతూ వచ్చి నన్ను కలుసుకొనుటచే, వళ్లంతయు జోరు