పుట:Chinnanati Muchhatlu K N Kesari 1999 206 P.pdf/197

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిన్ననాటి ముచ్చట్లు189


వచ్చులోపల దోవలోనే ముగించి వచ్చుచుండిరి. అప్పుడందరు తాంబూలములను జాడించి పక్కలను పరచుకొని పండుకొని తలప్రక్కన మగినపు వత్తుల దీపములను పెట్టుకొని చదువుకొనుచు నిద్రించుచుండిరి. వీరికి పగలుకూడ పండుకొని చదువుకొనుటకు అలవాటుగా నుండెను.

ఆ కాలమున మద్రాసులో పార్శినాటక కంపెనీవారువచ్చి లా కాలేజీకి ప్రక్కన నాటకశాలను నిర్మించి నాటకములను ఆడుచుండిరి. ప్రతి శనివారము, ఆదివారము అందరము కలిసి వెళ్ళుచుండెడివారము. కందస్వామి గుడి కైలాస పర్వతోత్సవమునకును, పార్థసారధిస్వామి అద్దాలపల్లకి మహోత్సవమునకు కూడ అందరము కలసి పోవుచుంటిమి. ఆ కాలమున జట్టు కత్తిరింపులు లేవు గనుక కొందరు జట్టుకు కేశరంజన్ తైలమున పూసుకొని మల్లెపూలను చుట్టుకొనుచుండిరి. వన భోజనములకు తిరువత్తియూరును, మైలాపూరు తిరునాళ్ళకును పోవుచుంటిమి. ఈ ప్రకారము ఆంధ్ర విద్యార్థులు ఆ కాలమున కాలమును కులాసగ గడుపుచుండిరి. ఇంటినుండి వచ్చు డబ్బు చాలక అప్పుపెట్టుచుండిరి. వివాహమైన విద్యార్థులు త్వరగ పరీక్షలను ముగించుకొని స్వస్థానములను చేరుటకు కష్టపడి చదువుచుండిరి. కాని బ్రహ్మచారులు పరీక్షలను బేస్తు పెట్టుచుండిరి. 'ఏలనంటే పరీక్షలను ప్యాసుచేసి ఆ పాడు పల్లెటూళ్లకు పోయిన మన సుఖమును చూచువారెవరునుండరు. మద్రాసులోనే యుండి కాలేజి చదువుచుండిన మనకు మంచిమనువులు వచ్చి లావైన వరకట్నములు లభించును' అని చెప్పుచుండిరి. 'రాత్రింబవళ్లు చదివి చచ్చి చెడిసున్నమైతే మనము మాత్రము ప్యాసు కాలేమట్రా" అని అనుకొనుచుందురు.