184 చిన్ననాటి ముచ్చట్లు
తాండవనృత్యము సల్పినప్పుడు సభ్యుల ఆనందమునకు మేరలేకుండెను. ఆ స్థూలకాయముతో ఆమె అంత చులకనగ చువ్వవలె యెగురుచు చేసిన నృత్యమున బల్ల కూర్పు ఈమె పాదతాళము ప్రతిధ్వనినిచ్చుచుండెను. అప్పటికే నడివయసురాలు - వడ్యాణమును ధరించుటకు వీలులేకపోయినను నాడాతో బిగించిన నడుమును విల్లనంబువలె వంచగలిగెను. ఈమె పాడిన 'శివదీక్షాపరురాలను రా' అను కీర్తనకు గ్రామఫోను ప్లేట్లున్నవి.
సుప్రసిద్ద లాయరుగ నుండిన పనప్పాకం ఆనందాచార్యులుగారు గొప్ప గానకళాపోషకులుగ నుండిరి. వీరు ఆంధ్రులు. ఆంధ్రభాషాభిమానులు. వీరప్పుప్పుడు తెలుగుపత్రికను కూడ నడుపుచుండిరి. కాంగ్రెసు ప్రెసిడెంటు పీఠమును అలంకరించిన దేశభక్తులు. సంగీతజ్ఞానము గలవారగుటచే వీరింట అప్పుడప్పుడు గానసభలు జరుగుచుండెను. నేను పోవుచుంటిని.
మద్రాసు గోవిందప్పనాయుని వీధిలో తచ్చూరు శింగరాచార్యులు గారుండిరి. వీరు సంగీత విద్వాంసులు. ఫిడియలును చక్కగ సాధకమును చేసినవారు. వీరింటిలోనే శ్రీరామమందిరమును యేర్పాటుచేసి అప్పుడప్పుడు గానసభలను చేయుచుండిరి. ఆ కాలమున విద్యార్థులకు ఉచితముగ వీరు విద్యను నేర్చుచుండిరి. ధర్మబుద్ధి గలిగినవారు 'సంగీతకళానిధి'యను గ్రంథము వీరు వ్రాసినదే. తెలుగుదేశమున 'సరిగమ పదనిసలు' నేర్చినవారికెల్ల ఇదియే పాఠ్యగ్రంథము.