Jump to content

పుట:Chinnanati Muchhatlu K N Kesari 1999 206 P.pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిన్ననాటి ముచ్చట్లు183

అళగనంబిని చూడకనే సుశబ్దమును వినినవెంటనే గుర్తించగలిగెను. ఈ విషయమును యిప్పటికిని చెప్పుచుందును.

ఆ కాలమున మద్రాసులో జరుగు వివాహకార్యముల సందర్భములలో జరుగు సంగీత కచేరీలకు స్త్రీలు వచ్చెడివారుగాని బహిరంగముగ జరుగు గానసభలకు స్త్రీలు అంతగ వచ్చెడివారుకారు. కొద్దిమంది సంగీతజ్ఞానముగలవారు వచ్చినను చాటున కూర్చుండి పాటను విని పోవుచుండిరి. ఇప్పటివలె అప్పుడు స్త్రీలలో గానకళాభ్యాసము వ్యాప్తిచెంది యుండలేదు. ఆ కాలమున దాశీలుతప్ప తక్కినవారు గానమభ్యసించుట మర్యాదగ నుండెడిది కాదు.

జార్జిటవున్ గోవిందప్పనాయుని వీధిలో యుండు గొప్ప శెట్టిగారింటిలో వివాహము జరిగెను. ఆ వివాహమునకు ఆటకచ్చేరీని యేర్పాటుచేసిరి. అప్పడు మద్రాసులో షణ్ముఖవడివేలను నాట్యకోవిదురాలుండెను. ఈమె నాట్యమును అప్పుడు జనులు హెచ్చుగ మెచ్చుకొను చుండిరి. ఈమె స్థూలకాయమును గలిగిన నల్లటి నటకురాలు. పొట్టిగనుండును. ఇట్లుండినను ఈమె నాట్యము మెచ్చుకొనదగినది. జనులు గుంపులుగ వచ్చుచుందురు. నేనుకూడ ఆనాడు అక్కడ ముందున కూర్చుండగలిగితిని.

సాధారణముగ పెండ్లిండ్లలో పెండ్లి పెద్ద ముందు కూర్చుండును. ఈ యింటిశెట్టి వీరవైష్ణవ సాంప్రదాయకుడు. దట్టముగ నామమును ధరించి ముందు కూర్చుండెను.

ఈ నటకురాలు 'శివదీక్షాపరురాలను రా' అను పాటను పాడుచు శెట్టిగారి ముందు కూర్చుని ఆనాడు బిల్వదళముల అర్చనచేయ అభినయము ఇప్పటికిని నాకు మరుపురాని దృశ్యము. అటుపిమ్మట ఈమె