పుట:Chinnanati Muchhatlu K N Kesari 1999 206 P.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిన్ననాటి ముచ్చట్లు 11

చచ్చిపడియుండిన వారిని గుర్తించుటకు వారి బంధువులకు అనుమతి నిచ్చిరి. అయితే చచ్చిన వారంతా నల్లగా బొగ్గు రూపమును దాల్చియుండుట వలన నిజమైన వారిని బంధువులు గుర్తించలేకపోయిరి. సగముకాలి వంటిన నగలున్న వారుకూడా కొందరుండిరి. అట్టివారిని 'మావారు' అని వీరు, 'మావారు' అని వారు తగాదాలను పెట్టుకొనిరి. కొందరిని మాత్రం బాగా గుర్తించగలిగిరి. చాలామంది గుర్తించనే లేకపోయిరి. ఆదినము రాత్రియింటికి 'రాని వారంతా, చచ్చినవారనే తలంపబడి, వారివారి ఇండ్లలో కర్మకాండ జరిపింపబడినది. కొన్ని యిండ్లనుండి కొందరు ఇంటిలో చెప్పకుండ అవసరము పనులపై గ్రామములకు వెళ్లినవారునున్నారు. అట్టివారికి కూడా వారి యిండ్లలో కర్మకాండ ముగిసిపోయినది. పిమ్మట ఆ ఊరికి పోయినవారు యింటికి తిరిగిరాగా, ఇంటివారును, వారును ఒకరి నొకరు చూచుకొన్నప్పడు వారివారి మనస్సు లెట్లుండెననేది పాఠకులే ఊహింపదగును.

ప్రదర్శనములోనుండి చావు తప్పించుకొని ఇవతల పడిన వారును కలరు. అట్టి వారిలో సుప్రసిద్ద పురుషులగు శ్రీ కొల్లా కన్నయ్యశెట్టి గారొకరు. వీరు మంచి కసరతు చేసిన బలశాలులు. వీరు లోపలినుండి బైటికి తడికల ఆవరణముపైకి పల్టీకొట్టి వెలుపలికి దూకిన సాహసికులు, చతురులు. వారట్లు దూకుచుండగా వారిమెడలో నుండిన పెద్ద పగడాల కంఠమాల జారి క్రిందపడిపోయినది. ఆదండ దొరికిన వాడు మరునాడు శెట్టివారింటికి వెళ్లి సమర్పించుకొని బహుమానమును పొందినాడు. ఆ కాలమున కొల్లా కన్నయ్య శెట్టిగారిని, వారి మెడలో యుండు పొగడాల మాలను తెలియని వారరుదు.

వీరు కోమట్లలో పెద్ద శెట్టి. వైశ్యులందరు వీరిని పూజించనిదే వారిండ్లలో శుభ కార్యములను చేసుకొనే వారుకారు. ధనికుడు; దాత;