178 చిన్ననాటి ముచ్చట్లు
మొనర్చుకొనుటకు దురభిమానము అడ్డురాని మనస్తత్వము, చక్కని శారీరము ద్రావిడమునను చక్కని ఉచ్చారణ - ఇవన్నియు - ఆ వేషము ధరించి మెప్పించుటకాయనకు అమరియున్నవి. ఆయనతోపాటు శిష్యుడు శ్రీనివాసుని వేషము వేయుచుండిన దెందులూరి సుబ్రహ్మణ్యశాస్త్రియు గొప్ప నటుడన చెల్లును. ఆయన పిదప నా పాత్ర ధరించుచున్న వంగర వెంకటసుబ్బయ్యగారును ఆ వేషమున ఒప్పించుచుండిరి. ఈ వెంకట సుబ్బయ్యగారే వేశ్యమాతగాకూడ నటించుచుందురు.
బళ్లారి రాఘవాచార్యులుగారిని ఆంధ్రనటులనుట కన్నను భారతీయ నటులని యందును. 'చిత్రనళీయము'న నలుడు, బాహుకుడనై నటించినారు. 'తప్పెవరిది?'లో సబ్రిజిస్టారు పాత్ర నిర్వహించినారు. విజయనగర సామ్రాజ్యపతనమున పఠాన్రుస్తుం పాత్రను, ప్రహ్లాద నాటకమున హిరణ్యకశ్యప పాత్రను, చంద్రగుప్తయందు చాణక్యపాత్రను, రామదాసునందు రామదాసు పాత్రను ధరించి మెప్పుబడసినారు. తెలుగు, కన్నడ, హిందీ, ఆంగ్లనాటకములన్నిట నొక్క రీతిగా నటించి ఉత్తమనటుడు అనిపించుకున్నాడు. రవీంద్రనాథ ఠాగూరు అంతవారు 'ఉత్తమ భారతీయనటుడు' అని ప్రశంసించినారు.