Jump to content

పుట:Chinnanati Muchhatlu K N Kesari 1999 206 P.pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిన్ననాటి ముచ్చట్లు177

రాణించిరి. వీరు కందుకూరి వీరేశలింగంగారిచే తర్జుమా అయిన శాకుంతలమున దుష్యంతపాత్ర ధరించిరి. శ్రీ సూర్యనారాయణగారు హఠాన్మరణము చెందుటచే నాట్యకళకు గొప్ప లోటైనది.

స్థానం నరసింహారావుగారిని ఆంధ్రదేశమున ఎరుగని వారుండరు. వారు చిత్రాంగి, సత్యభామ, దేవదేవి, మధురవాణి, చింతామణి మున్నగు వేషములు వేయగా చూచియున్నాను. ఈ వేషములన్నింటియందును వారు చాలా విశేషముగ నటించగల్గి నవారు. చిత్రాంగిగావారు బహు నేర్పుతో నటింతురు. ఈర్ష్య అంతయు రూపెత్తినట్లు సత్యభామ వేషమున వ్యవహరింతురు. 'కుత్తుక ఖండించి' అన్న పద్యభాగమును చదువునప్పడు విషాదము, రోషము, ఈర్ష్య అన్నియు ఉట్టిపడుచుండును. దేవదేవిగా ఏ మాత్రమును భూషణముల ధరింపకయే, విప్రనారాయణుని ఆశ్రమ కుటీరముకడ సపర్యలు చేయుచు చూపు కపట భక్తిభావము, క్రమముగా నిజభక్తి భావముగా మారిపోవుట ఆయనయే అభినయింపవలయును. నిజముగా విప్రనారాయణ సేవాపరతంత్రయైయున్న దేవదేవి ముగ్ధ స్వరూపమున నతనిని మరువ సాధ్యముకాదు. మధురవాణిని పాత్రగా సృష్టించిన గురుజాడ అప్పారావు పంతులుగారు వీరి 'మధురవాణి' పాత్రాభినయమునుగాంచి యున్నచో తన పాత్రపోషణమున కీయన మెరుగు పెట్టెనని తలంచుననుటకు సందేహములేదు.

ఇంకను ఎంతోమందిని ఉత్తరాదినటులను చూచియున్నాను. వారందరును సామాన్యులు. విప్రనారాయణుడుగా కస్తూరి నరసింహారావు గారు బాగుగా మెప్పుపడసిరి. వైష్ణవభాగవతోత్తముని వేషమునకు తగిన స్థూలదేహము, ఊర్ధ్వపుండ్రములను గాత్రముగా ధరించుటకు వలయు విశాలమగు నుదురు, రొమ్ము, శ్రోత్రియ పాత్రకవసరమగు శిరోముండన