Jump to content

పుట:Chinnanati Muchhatlu K N Kesari 1999 206 P.pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

174 చిన్ననాటి ముచ్చట్లు

హరిశ్చంద్ర, యశోద, హిరణ్యకశ్యప, శ్రీనివాసాదిపాత్రల ధరించేవారు. సహాయనిరాకరణోద్యమమున ప్రవేశించి, కారాగారవాసమనుభవించి జబ్బుపడిరి. శాస్త్రిగారికిని వీరికిని పరస్పరానురాగ భక్తితాత్పర్యములు నశించలేదుగావున - జైలునుండి వచ్చిన యనంతరము ఉభయులు తిరిగి కలుసుకొనజొచ్చిరి.

ముమ్మడమ్మ వేషము మొదలు యుగంధరుని వేషమువరకు అన్ని వేషములు వేసినారు రంగసామి. ముఖ్యముగా స్త్రీపాత్రలను మొదట ధరించుచుండేవారు. శాకుంతల, మల్లమదేవి, చిత్రరేఖ - మున్నగు వేషములను ధరించేవారు. శకుంతల వేషమున ఆరణ్యకుల అమాయకత్వము, యావనప్రాయపు ముగ్ధతనము, భర్త తిరస్కృతయై, 'అనార్యా' అని అతని నిందించునప్పటి రోషావేశము - కణ్వశిష్యులు రాజాస్థానమున నీ కర్మమని విడిచిపోవునప్పడు దుఃఖాతిశయమున ఏమితోచమి పరవళ్లు త్రొక్కుచుపడు చిడిముడిపాటు - మారీచాశ్రమమున భర్తృపునస్సమాగమమున గాంభీర్యముద్ర, - వీనినన్నిటిని - అసదృశ్యముగా నటించేవారు.

నెల్లూరిలో ఆ రోజులలో వెంకటచలం గారిని పేరు చెప్పకుండా ఊరక ‘పంతులు' అంటే వీరికే అన్వయం అయ్యేది. నెల్లూరి రంగనాయకుల గాలిగోపురం కట్టించినది వీరి తాత వెంకటచలం పంతులుగారు. పంతులుగారు మంచి దర్పం గలవారు, ఆజానుబాహులు; ఒడ్డుపాడుగు; స్ఫురద్రూపులు. ఏ సభలో కూర్చున్నా 'సభాపతి' పదవి వహించవలసినదే. వారి సొమ్మైనది, ఢిల్లీ సుల్తాన్ వేషము. ఆ డాబు, ఆ దర్పము, ఆ డౌలత్ వారే చూపవలయును; తమకు తెలియకయే, అర్ధరాత్రమున వర్తకుల సరుకుల యోడలో బందీ కృతులై - వరంగల్కు తరలిపోవుచున్న సీను - అర్ధరాత్రమునకు తటస్థించును. ఆ సన్నివేశము గంభీరమును విషాదకరమునైనది.