Jump to content

పుట:Chinnanati Muchhatlu K N Kesari 1999 206 P.pdf/175

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

22

నాగరికపు నాటకములు

1890 ప్రాంతములో ధార్వాడ నాటకకంపెనీ యని ఉత్తరదేశమునుండి వచ్చి పలుతావుల నాటకములువేసి ప్రజాభిమానమును సంపాదించిరి. వీరు పాతపద్ధతుల నన్నింటిని మార్చి రంగస్థలమునకును, వేషభాషలకును మెరుగులను దెచ్చిరి. ఆముదపు దివిటీలకు బదులు రంగు మత్తాపులను వెలిగించుచుండిరి. కొయ్యతోచేసిన కాకిబంగారపు నగలకు బదులు గిల్టుసొమ్ములను ధరించుచుండిరి. మంచి ఉడుపులను ధరించుచుండిరి.

వీరి పిదప బొంబాయి ప్రాంతమునుండి పార్శీనాటక కంపెనీవారు మద్రాసుకు వచ్చి పెద్దకొఠాయిని దిట్టముగ పలకలతోను ఇనుపరేకులతోను కట్టి రెండు మూడు మాసములు దినదినము నాటకములు వేసేవారు. వీరి రంగస్థలపు ఏర్పాట్లు చాల రమణీయముగను ఆకర్షణీయముగను ఉండెడివి. ముఖ్యముగ వర్షము కురియుట, తుఫాను కొట్టుట, సముద్రము, ఇండ్లు కాలుట మొదలగువాటిని చూచినప్పుడు నిజముగ అవి జరుగుచున్నట్లే కాన్పించును. రంగస్థలముమీద వారు ధరించు ఉడుపులు దీపముల వెలుతురులో జనుల నానందాశ్చర్యముల ముంచివైచెడివి. వారు చూపించు దర్బారు సీనులద్భుతముగ నుండెడివి.

బళ్లారి సరస వినోదినీ సభ మూలపురుషుడు శ్రీమాన్ ధర్మవరము రామకృష్ణమాచార్యులు, ఆంధ్రదేశమున స్వతంత్రముగ నాటకముల రచించి, తానును పాత్ర వహించుచు తగువారిని తర్ఫీదు గావించి నాటకములనాడు కంపెనీలను ప్రారంభించిన ప్రముఖులు ప్రథములు వీరే యనవచ్చును. ధార్వాడ, పార్శీనాటక కంపెనీలు వచ్చివెళ్లుటకు కొంచెము వెనుకముందు