166 చిన్ననాటి ముచ్చట్లు
వెదురుబద్దలను కట్టుదురు. ఆ బద్దలకు దారములమర్చెదరు. ఈ సూత్రములను (దారములను) అన్నిటిని కథ నడుపువారు పదివ్రేళ్లకు తగిలించుకొని చేతబట్టుకొని లోతెరలో తెరపై బొమ్మలనుంచి నిల్తురు. పిదప కథానుసరణముగ ఆయాసూత్రములు లాగుచు ఆ బొమ్మల అవయాంగముల నాడింతురు. సంస్కృత నాటకముల నాటకమాడించు ప్రధాన పురుషుని 'సూత్రధారి' అందురు. నిజమున కతడు ధరించు సూత్రమేమియు లేదు. తోలుబొమ్మలాటలలోని సూత్రములే - ఈ సూత్రధారికి మూలమేమో? సూత్రధారి హస్తలాఘవమున రామరావణ యుద్దమును, సముద్ర లంఘనమును, లంకాదహనమును, వానరరాక్షస సమరమును, రథములను మొదలైనవాని నన్నిటిని పాటలతో, మాటలతో చిత్రవిచిత్రముగ దృశ్యములుగా చూపగల్గును.
అసలీ తోలుబొమ్మలాటకు మరాటీవారు ప్రసిద్ది. వీరు కథ నడుపునప్పడు - సంస్కృత సమాసములను, వాక్యములను చెప్పి – ముక్కముక్కగా విరిచి అర్థము చెప్పదురు. 'అశ్వ = గుర్రములున్నూ, గజ = ఏనుగులున్నూ......' ఈ విధముగా చెప్పుచుందురు. అమరమందలి శ్లోకములును చదువుదురు. అద్దంకిసీమను కొన్నాళ్లు మరాఠీ లేలినారు. బహుశా ఆ సంపర్కముచే మా ఊరి రంగిరీజుల కిది అబ్బియుండును.