పుట:Chinnanati Muchhatlu K N Kesari 1999 206 P.pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిన్ననాటి ముచ్చట్లు165

చేసెడివారు. పళ్లెములో నీళ్లు పోసియుంచి ఒక్క చుక్కనీరైన చిందకుండ దానియంచుపై నిల్చి నృత్యము చేయుచు గంటలకొలది 'బాలగోపాల మాముద్దరే అనే తరంగమును పాడగల నేర్పరులుండిరి. ఈ తరంగమున శ్రీ నారాయణ తీర్ణులవారు తాళప్రస్థారమునకు ఎంతో అవకాశము కల్పించి వ్రాసియున్నారు.

కూచిపూడివారి పలుకు స్ఫుటముగను, ఉచ్చారణ స్వచ్చముగను ఉండును. వీరి హాస్యమును మోటుగాక సరసముగ నుండును. వీరికి భాగవతమే విశేషముగ అభిమాన పాత్రమగు నాటకము.

చెంచునాటకములను గొల్లవారుచేరి ప్రదర్శించుచుండిరి. వీరి నాటకములు పల్లెటూళ్లలో చాల పేరుపొంది యుండినవి. ఒక ఊరిలో వీరు చాలదినములు బసచేసి నాటకములాడుచుండేవారు. వీరి నాటకములో ముఖ్యమగు ఇతివృత్తము అహోబిల నారసింహస్వామి చెంచెతను (చెంచువారి పడుచును) మోహించి వివాహమాడుట. ఆ చెంచెత కథనే 'గరుడాచల మహాత్మ్యము' అని పూర్వకవి యక్షగానముగా వ్రాసియున్నాడు. దాని ననుసరించి ఈ నాటకమును వీరాడుదురు.

మా వూరి రంగిరీజులు గుడ్డలమీద బొమ్మలను వేసి అద్దుటకు అలవాటుపడిన వారు గనుక పలచని తోళ్లను బొమ్మలవలె కత్తిరించి వాటికి రంగులనువేసి వాని సహాయమున నాటకములాడుచుండిరి. ముఖ్యముగ నేను జూచిన నాటకము రామాయణము. ఈ రామాయణ నాటకములోని దశకంఠుడు, ఆంజనేయుడు, సీత మొదలగు వారి చిత్రములతో కూడ వానరరాక్షస సేనలుండినవి. ఈబొమ్మలకు చేతులు కాళ్లు తల మున్నగు అవయవములన్నియు విడివిడిగనే చేయబడి - దారములతో కట్టబడి యుండును. బొమ్మలకు వెనుకప్రక్క అన్నిటికి కలిసి వచ్చునట్లు