పుట:Chinnanati Muchhatlu K N Kesari 1999 206 P.pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిన్ననాటి ముచ్చట్లు161


సంస్థానము తగ్గుదశకు రాగానే వారు మద్రాసుకువచ్చి బొమ్మలను వ్రాయు వ్యాపారమును స్థాపించిరి. వీరు పలకలమీద చింత విత్తనముల జిగురుతో బొమ్మలను వ్రాసి దానిమీద సన్న బంగారురేకును అంటించి మెరుగుబెట్టి పఠములను తయారుచేయుచుండిరి. అటు తయారైన పఠములు యెంతకాలమైనను మాసిపోక మెరుగుతో తళతళలాడుచుండును. పూర్వము మద్రాసులో ఈ పఠములకు మంచి గిరాకీ యుండెడిది. మద్రాసులో అనేకుల ఇండ్లలో వీరి పఠములు గలవు. ఉప్పటూరి ఆళ్వారుశెట్టిగారి రామానుజ కూటమున ఇవి గలవు. ఈ పురాతన చిత్రకళ క్రమముగ నశించిపోయినదనే అనవచ్చును.

శ్రీమతి రత్నాల కమలాబాయిగారు తాను చిత్రించిన త్రివర్ణ చిత్రములతో 'గృహలక్ష్మి' పుటలతరచు అలంకరించుచుండిరి. ఈమె చిత్రకళా నైపుణ్యమునకు మెచ్చి యొకసారి గృహలక్ష్మీ స్వర్ణకంకణమును తొడిగి గౌరవించితిని. ఇంకను అనేకులు చిత్రకారులు వ్రాసిన చిత్రములను కొని ప్రచురించి వారికి ప్రోత్సాహమొసంగితిని.

ఆహార్యము, అభినయము, సంగీతము ప్రాధాన్యముగాగల నాట్యకళ బహువిధములు. వీధి భాగవతములు, తోలుబొమ్మలాటలు, భరత నాట్యము, నృత్యము, ఆధునిక నాటకములు. ఇవి అన్నియు ఆ కళ క్రిందికే వచ్చును. నా నాట్యకళాభిమానము వీధి నాటకములను చూచుటతో ప్రారంభమైనది. బాల్యమున ఈ వీధి భాగవతములన్న నాకు చాల వెర్రి. మా వూరిలో మద్దెలమీద దెబ్బపడిన శబ్దము వినగనే నేనక్కడ హాజరుగ నుండెడివాడను.

నా కుఱ్ఱతనమున మొట్టమొదట నేజూచినవి మాలనాటకములు. ఆ రోజులలో మా వూరి మూలవాడనుండి మాలవారు వచ్చి గ్రామమునకు