21
లలిత కళాభిలాష
చిత్రకళ, నాట్యకళ, గానకళ మొదలగు లలితకళలందు నాకు చిన్నప్పటినుండి నైజముగానే ఎక్కువ అభిలాష కలదు. శాస్త్రయుక్తముగ ఆయావానిని అభ్యసించుటకు నాకు పూర్తిగ అవకాశము లేకపోయినను, చూచి, విని వాని ప్రాశస్థ్యమును తెలయగల సహృదయుడు అని నా మిత్రులనుచుందురు.
గృహనిర్మాణ మొక శిల్పము. దాని రహస్యము లెరుంగుటయు నొక విశేషమే. చిన్నతనములోనే నాకు ఇందు నేర్పు కల్గినది. కుఱ్ఱతనమున ఆడబిడ్డలకు బొమ్మరిండ్లను అందముగ గట్టుచుంటిని. అందువల్ల ఊరి వారందరు వారి బిడ్డలకు బొమ్మరిండ్లు కట్టిపెట్టుమని నన్ను ఆశ్రయించే వారు. ఈ విద్య నేను శిక్షణ లేకనే అలవరచుకొన్నది. మద్రాసులో కట్టించిన నా భవనములన్నియు స్వంత ప్లానులతో కట్టినవే.
చిత్రలేఖనము చిన్నతనముననే అభినివేశము ఏర్పడినది. మా అమ్మ పండుగలకు ఇల్లంతయు గోడలకు శుభ్రముగా సున్నము కొట్టించేది. ఆ తెల్లనిగోడలు చూడగానే నాకు ఉత్సాహము కల్గి బొగ్గు తీసుకొని తోచినట్లు బొమ్మలు గీచేవాడను. వానిని చూచినవారు ఆయా బొమ్మల ముక్కు కన్ను తీరు బాగున్నదనియు, నాచేతిలో శిల్పమున్నదనియు మెచ్చుకొనేవారు. కాని మా అమ్మ తెల్లగోడలను బొగ్గుతో గీచి పాడుచేసితినని నన్ను తిట్టేది.
మద్రాసు గోవిందప్పనాయుని వీధియందు టి.వి. సుబ్బన్న అండ్ బ్రదర్సు అను పేరుతో చిత్రముల వ్రాయు ముచ్చి వారుండిరి. వీరు కార్వేటినగరం సంస్థానమున రంగుచిత్రములను వ్రాయుచుండిరిగాని ఆ