పుట:Chinnanati Muchhatlu K N Kesari 1999 206 P.pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిన్ననాటి ముచ్చట్లు159


విల్లంబువలె వంగి లేచెదరు. మరియు వీరు అనేక అవలక్షణములను ప్రదర్శించెదరు. ఈ లక్షణములుగల స్త్రీకి దయ్యము పట్టినదని తలంచి భూతవైద్యుని పిలిపించి భూతచికిత్సను చేయించెదరు. వైద్యుడు వచ్చి ఇంటిలో ముగ్గులను కలశమును పెట్టించి కొన్ని దినములు దివారాత్రములు శక్తిని పూజించి బలిదానములను సలుపుదురు. ఆ స్త్రీని ముగ్గులో కూర్చుండబెట్టి, సాంబ్రాణి గుగ్గిలములవేసి ధూపమునువేసి మంత్రవేత్త మంత్రోచ్చారణతో దయ్యమును పారదోలుటకు పాతచెప్పులను, చింపిచాటలను, చీపురు కట్టలను ప్రయోగించును. ఈ బాధలకు ఆమె తాళజాలక కొంతసేపటికి సొమ్మసిల్లి నేలవాలును. అప్పడు మంత్రవేత్త ఈమెను పట్టిన దయ్యము పారిపోయినదని చెప్పును. ఇకను ఈమెకు గ్రహబాధ లేకుండుటకు మెడలో తాయిత్తు రక్షరేకులుకట్టి బహుమతులను పొంది పోవును.

సన్నిపాత జ్వరము లేక విషమజ్వరము (టైఫాయిడ్ జ్వరము) వచ్చినప్పుడు రోగిని 21 దినములు లంకణములనుంచెదరు. దీనిని మా ప్రాంతములలో లంకణముల జ్వరమని కూడ చెప్పెదరు. ఈ జ్వరితునకు నాటువైద్యులు వచ్చి కొన్ని కుప్పెకట్లు కణికలను చాది పోసెదరు. తెల్ల జిల్లేడాకుల పసరును, కాడజముడు కాడల స్వరసమును, ఆకుజముడు పొంగురసమును అనుపానములుగ వాడెదరు. వాడిన మందుల పేరులడిగినప్పుడు, ఇది కాలకూటరసమనిన్ని, సన్నిపాత భైరవిరసమనిన్ని, ప్రతాపలంకేశ్వర రసమనిన్ని, చండమార్తాండ రసమనిన్ని మృత్యుంజయ రసమనిన్ని చెప్పెదరు.