20
నాటువైద్యము
చంటిబిడ్డలకు చిన్నబిడ్డచేష్టయను ఈడుపువాయువు వచ్చినప్పుడు వారు కండ్లు తేలవేసి, స్పృహతప్పి, కడుపుబ్బి కష్టపడుచుందురు. అప్పుడు తల్లి తహతహలాడుచు ఇరుగుపొరుగు అమ్మలక్కలకు చూపించును. చూడవచ్చినవారిలో వారివారి అనుభవముల ననుసరించి ఒక తల్లి జిల్లేడాకులరసమును బిడ్డ ముక్కులనిండుగ పిండును. మరియొక తల్లి కుంకుడుకాయ నురుగు ముక్కులలో పోయును. పుల్లమ్మవచ్చి పసుపుకొమ్మును దీపమున కాల్చి కనుబొమ్మల నడుమను గట్టిగ వత్తి కాల్చును. ఎల్లమ్మ వచ్చి కాకరాకు పసరు మంచిదని చెప్పును. త్రోవను పోవు పిచ్చిరెడ్డివచ్చి తాను పీల్చుచున్న లావాటి పొగచుట్టతో శిశువు ముఖమున కాల్చును. మరియొక అనుభవశాలి వచ్చి బిడ్డ పొట్టమీద సూదులతోను, దబ్బనముతోను కాల్చి వాతలు వేయును. పిమ్మట మంత్ర, తంత్రవేత్తలు వచ్చి రక్షరేకులను కట్టి దిగదుడుపులను దుడిచిపోవుదురు. ఈ నోరులేని పసికూనలు ఇన్ని మోటుచికిత్సలకు గురియై జీవించినను, పెట్టిన వాతలు పుండ్లు అయి చీముపట్టి చిరకాలము బాధపడుదురు. బాల్యమున యిట్టిచికిత్సలకు లోనైన పలువురి ముఖముల మీదను పొట్టలమీదను కాల్చిన మచ్చలను చూచుచున్నాము.
వయసువచ్చిన ఆడుబిడ్డలు కొందరు ఋతుస్రావదోషమువల్ల వాతోన్మాదమను మూర్చవల్ల బాధపడుచుందురు. వీరు అకస్మాత్తుగ స్పృహతప్పి నేలబడెదరు. పక పక నవ్వెదరు. భోరున యేడ్చెదరు. దగ్గిరనున్నవారిని కాళ్లతో తన్నెదరు. చేతులతో పీకెదరు. నోట నురుగును కార్చెదరు. బుసకొట్టెదరు. ఎగరొప్పెదరు. నలుగురు పట్టుకొనినను నిలువక