చిన్ననాటి ముచ్చట్లు 153
కళాశాలయందు ఉపాధ్యాయులుగకూడ ఉండిరి. బంగాళీభాషనుండి భక్తియోగము, పూర్ణ యోగము మున్నగు గ్రంథములు కొన్ని తర్జుమా చేసియున్నారు. వీరు శారద పత్రికను ఉచ్ఛస్థితిలో నడుప యత్నించిరి, చాల నష్టపడి బందరు విడిచి మద్రాసు చేరిరి. వారికి నా యింటనే స్థలమిచ్చి గృహలక్ష్మీ పత్రిక కార్యాలయమున ఉద్యోగమిచ్చి ఆదరించితిని.
పసుమర్తి కృష్ణమూర్తి శాస్త్రి గారు కూడ వితంతు వివాహమాడినవారే. వీరును బిడ్డలతోకూడ మద్రాసుకు వచ్చి కష్టపడుచుండిరి. వీరి ఇద్దరు ఆడబిడ్డలు సంగీతమున పరిచయము గల్గినవారు. కుమారుడు చిన్నకుమార్తె వేణుగానమును, పెద్దకుమార్తె ఫిడియల్, గాత్రమును సాధనమొనర్చి యున్నారు. వీరందరికి నా యింటనే వసతినిచ్చి గృహలక్ష్మి ఆఫీసులో శాస్త్రిగారికి కొలువిచ్చితిని. వీరి బిడ్డలందరిప్పడు మంచిస్థితిలో యున్నారు. మహలక్ష్మమ్మ వితంతువై తిరిగి వివాహమాడినది. పాపము రెండవ భర్తనుకూడ పొగొట్టుకొని నర్సుపనిని నేర్చుకొని మావద్ద కొలువునకు కుదిరినది. ఈమె మంచి భాషా జ్ఞానముగల తెలుగుతల్లి, నేర్చుగ వ్రాయకలిగిన ముసద్దీ.
వీరేశలింగం పంతులుగారు వృద్ధాప్యమున వ్యాజ్యములలో చిక్కుబడుట అందరికి తెలిసిన విషయము.