చిన్ననాటి ముచ్చట్లు149
అంగవస్త్రములను ధరించుట ఆ కాలమున నాజూకు. వెడల్పాటి బెంగుళూరు సరిగ తలపాలగాకు పెద్దపేరు లేకపోయినను, నెల్లూరు వెంకటగిరి సన్నసరిగ తలగుడ్డలకు మాత్రము మంచిపేరుండెను. ఆరణి పంచలను వెంకటగిరి తలగుడ్డలను ఆరణి చాకలివానికివేసి వాడుకొనుచుంటిని. మేలైన మల్లు వస్త్రములను వెలగల పట్టు చొక్కాయీలను కేంబ్రిక్ తెల్లషర్టులను విరవిగ వాడుకలో నుండెను. అంగవస్త్రములకు ఆరణి చాకలి, షర్టులను చొక్కాయిలను యిస్త్రీ పెట్టుటకు మద్రాసు చాకలి యుండెను. రెండు బీరువుల నిండుగ ఈవుడుపు లుండెడివి. సాక్సు బూటు వాడుకలో నుండెను. పలుమారు దుస్తులను మార్చుచుంటిని.
నా చెవులకు ఒంటిరాయి వజ్రముల అంటుజోడుండెను. చిటికినవ్రేలికి 5 కారట్ల వజ్రపు వుంగరముండెను. జేబులో పెద్ద బంగారపు గడియారము, పొడుగాటి గొలుసు, దానికి మెడల్పు వ్రేలాడుచుండెను. పికారుకు పోవునపుడు చేతులో వెండిపొన్ను వేసిన మొరాక పేముండెడిది. మొలకు విజయనగరపు బంగారు మొలత్రాడుండెను. ఇంకనెన్నియో పటాటోపములుండెను.
గాంధీ మహాత్ముని ఉపదేశ గీతములను వినిన వెంటనే క్రమముగ నాలో అనేక మార్పులు కలిగెను. నా వేషము మారినది. తల బోడిచేసి సరిగ తలగుడ్డకు బదులు గాంధి టోపిని ధరించితిని. సరిగ వస్త్రములు, పట్టుచొక్కాలు, దుకూలాంబరములు దూరములయినవి. సాత్వీకాహారము లను మితముగ భుజించుటకు అలవడితని. ఆకలి లేనిది ఆహారములను తీసుకొనుట మానితిని. కాఫీని కొంతకాలమువరకు మానగలిగితిని. మేకపాలను కొన్ని దినములు రుచి చూచితిని. వేరుశనగలు వికటించు వరకు తింటిని. రాట్నమును త్రిప్పుటకు ప్రారంభించితిని. సాధ్యమైనంతవరకు ఖద్దరు వస్తాములనే కట్టుచుంటిని. ఇంట బైట ఖద్దరుజుబ్బాతోనే కాలము