143 చిన్ననాటి ముచ్చట్లు
ప్రవేశించి భక్షించుచుండును. మదురుగోడలను దూకి దొంగలుకూడ రాత్రిళ్ళు అపహరించుకొని పోవుచుందురు. కాయకూరలను వెనుకభాగమున వేయుచుంటిని. ఇక్కడ పెంచిన వంకాయలు టెంకాయలంతేసి యుండును. ఈ నల్లవంకాయలు బజ్జికి బాగుండును. పాలబెండకాయలు సుమారు యొక అడుగువరకు పెరుగును. కొతిమేరాకు, తోటకూర వగైరాలు అతి కోమలముగ యెత్తుగ పెరుగును. ఈ వూరి కూరగాయలు కంటికి బాగుండునే గాని రుచి తక్కువ. కాయకూరల రుచికి వంగవోలు ప్రాంతములలో మెట్టన పండునవియే శ్రేష్ఠము. బెంగుళూరులో విక్రయించు వంకాయలు చేదుగ నుండును. పెద్ద కాకరకాయలు తియ్యగనుండును. ఇందుకు కారణము కృత్రిమ యెరువులతో కాయకూరలను పెంచుటయే.
ఇంటి వెనుకభాగముననే ఔషధములను తయారుచేయు కర్మాగారమును (Factory), అతిథుల గృహమును ఆఫీసును వేరువేరుగ కట్టించితిని. ఈ మందిరములకు యెదుట పందిళ్లు వేయించి నల్ల, తెల్ల ద్రాక్షతీగెలను అల్లించితిని. ఈ ద్రాక్షపండ్లు బాగుగ కాయుచున్నందున మేము తనివితీర తిని యితరులకుకూడ పంచిపెట్టుచుంటిమి.
ఈ తోటలో యొకభాగమున అశ్వత్థవృక్షము, వేపచెట్టు కలసియుండెను. ఆ చెట్లు క్రింద నాగప్రతిష్ట కలదు. ఆ చెట్లచుట్టు నల్ల రాళ్లతో అరుగును కట్టించితిని. ఆదివారమునాడు ఆ దేవుని పూజించు చుంటిమి. అప్పుడప్పుడు అక్కడ కూర్చుని విశ్రాంతి తీసుకొనుచుంటిమి. మరియొక భాగమున చంపక పుష్పముల వృక్షముండెను. ఈ మాను సంపెగ చెట్టు క్రింద సిమెంటుతో రెండు అరుగులను కట్టించితిని. ఉదయమున కొంతకాలము తోటలో తిరిగి, ఆ యరుగులమీద కూర్చుండి అలసట తీర్చుకొను అలవాటు. ఈ సంపెంగ చెట్టుక్రిందనే వచ్చినవారితో ముచ్చటలాడుచుండువాడను. ఈ చెట్టుచూచినప్పుడు ఈ చెట్టు నీడను విడిచిపోవుటకు మనసొప్పకుండెడిది. ఈ నీడను నేనెట్లుమరువగలను?